సిఎం కెసిఆర్ మరో కీలక నిర్ణయం.. ప్రతి అడిషనల్‌ కలెక్టర్‌కు రూ. 25లక్షలు

-

పల్లెప్రగతి, పట్టణ ప్రగతి పై జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారుల(డీ పీ వో )తో ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సిఎం కెసిఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందరి భాగస్వామ్యం అవసరమనీ, ఆ క్రమంలో తాను కూడా స్వయంగా ఒక జిల్లాను దత్తత తీసుకుని పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. పల్లెలు పట్టణాలను ప్రగతి పథంలో నడిపించేందుకు జిల్లా అదనపు కలెక్టర్లు , జిల్లా పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ అధికారులు కంకణబద్దులు కావాలని, గ్రామాలు పట్ణణాల అభివృద్ధిని ఒక యజ్ఞంలా భావించి కృషి చేయాలని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో మొక్కలు నాటే హరితహారం కార్యక్రమాన్ని త్వరలో చేపట్టాలని అధికారులకు సూచించారు. తాను చేపట్టబోయే ఆకస్మిక తనిఖీలు, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి లో మెక్కలు నాటడం తదితర కార్యక్రమాల పురోగతి తనిఖీలో భాగంగానే సాగుతాయని సిఎం స్పష్టం చేశారు.

ఇంతగా తాను సమావేశం నిర్వహించి వివరించినా తమ పనితీరు చక్కదిద్దుకోకపోతే క్షమించే ప్రసక్తేలేదన్నారు. తన ఆకస్మిక తనిఖీ నేపథ్యంలో పనితీరు బేరీజు వేసి కఠిన చర్యలుంటాయని, ఆ తర్వాత ఎవ్వరు చెప్పినా వినేదిలేదని.. అదనపు కలెక్టర్లకు డిపివోలకు సిఎం మరోసారి తేల్చి చెప్పారు. జూన్ 20 న సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అకస్మిక తనిఖీలుంటాయని సిఎం తెలిపారు. జూన్ 21 న వరంగల్ జిల్లాలో సిఎం కెసిఆర్ ఆకస్మిక తనిఖీలుంటాయన్నారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా వరంగల్ జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని ప్రారంభించి., నూతనంగా నిర్మించ తలపెట్టిన మల్టీ సూపర్ స్పెషాలిటీ దవఖానకు శంఖుస్థాపన చేయనున్నట్లు సిఎం కెసిఆర్ తెలిపారు. స్థానిక సంస్థల సమస్యలను పరిష్కరించే క్రమంలో అప్పటికప్పుడు కొన్ని అవసరమైన నిధులను మంజూరు చేయడానికి ప్రతీ జిల్లా అడిషనల్ కలెక్టర్ కు 25 లక్షల రూపాయలను తక్షణమే కేటాయించాలని ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. ఈ సమావేశం ముగిసేలోపే ఈ మేరకు దీనికి సంబంధించిన జీవోను అడిషనల్ కలెక్టర్లకు అందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version