మరో వారంలో శ్రీరామనవమి పండుగ వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీతారాముల ఆలయాలు వేడుకలకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయం కూడా ముస్తాబవుతోంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.
శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించనున్న నేపథ్యంలో రామాలయ ఈవో రమాదేవి, స్థానాచార్యులు స్థలసాయి, ప్రధానార్చకులు సీతారామానుజాచార్యులు, ఆలయ అధికారులు బుధవారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిశారు. ఉత్సవాల ఏర్పాట్లను వివరించారు.
అనంతరం వీరంతా ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి వెళ్లి స్వామివారి ప్రసాదాన్ని అందించి సత్కరించారు. కల్యాణ ఆహ్వాన పత్రికను అందించి 30న నిర్వహించే శ్రీరామ నవమి వేడుకలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. తర్వాత ఆలయ ఈవో ఆధ్వర్యంలో అధికారులు, అర్చకులు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి ఆహ్వాన పత్రం అందించారు. 31న పట్టాభిషేకం కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు.
శ్రీరామనవమి సందర్భంగా ఈనెల 30న భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని కోరుతూ సీఎం శ్రీ కేసీఆర్ దంపతులను ఈరోజు ప్రగతి భవన్ లో కలిసి ఆహ్వాన పత్రికను అందజేసిన దేవాదాయశాఖ మంత్రి శ్రీ @IKReddyAllola.
ఈ సందర్భంగా ఆలయ ఈవో, పూజారులు తదితరులు పాల్గొన్నారు. pic.twitter.com/RBSAEZG8yw
— BRS Party (@BRSparty) March 22, 2023