అన్నదాతల ఆత్మగౌరవాన్ని కాపాడేలా జాతీయ స్థాయిలో రైతు ఐక్య సంఘటనను నిర్మిద్దామని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టి సాగును కాపాడుదామన్నారు. జాతీయ రైతు సంఘాలతో రెండో రోజు సమావేశమైన కేసీఆర్ రాజకీయాల్లో రైతు నేతలు భాగస్వాములు కావాలని, అన్నదాతలను చట్టసభలకు పంపిద్దామని ప్రతిపాదించారు. ఉద్యమం, రాజకీయాలు.. ఎక్కడ ఏవి అవసరమో అవి చేద్దామన్నారు. కార్యాచరణకు త్వరలో బ్లూప్రింట్ విడుదల చేద్దామన్నారు. దేశానికి రైతే రాజు కావాలని, ఆరోజు త్వరలోనే వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు.
దేశవ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి రైతులను ఐక్యం చేసే కార్యాచరణకు కేసీఆర్ నాయకత్వం వహించాలంటూ జాతీయ రైతు సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. కొత్త సాగుచట్టాలు, కరెంటు మోటార్లకు మీటర్లు, ధాన్యం కొనుగోళ్ల నిలిపివేతతోపాటు పంటల ఎగుమతులు, దిగుమతుల్లో అసంబద్ధ విధానాలతో కేంద్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని రైతుసంఘాల నేతలు దుయ్యబట్టారు. సాగును నిర్వీర్యం చేసి, కార్పొరేట్‌కు అప్పజెప్పేందుకు కుట్ర జరుగుతోందని, దీన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.