హైదరాబాద్: మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన ఈటల వెంట ఎవరూ వెళ్లకుండా అధికార పార్టీ కట్టడి చర్యలు చేపట్టింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో పట్టు సడలకుండా ఆపరేషన్ హుజూరాబాద్‌కు తెరతీసింది. పార్టీ ముఖ్యనేతలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. పట్టు నిలుపుకునేందుకు అటు ఈటల..తీవ్రంగా నష్టపోకుండా ఇటు టీఆర్ఎస్ పెద్దలు ప్రణాళిక రూపొందించడం రాజకీయం రసవత్తరంగా మారింది.
కరీంనగర్ నేతల ఉమ్మడి మీడియా సమావేశం తర్వాత ఈటల రాజేందర్‌ను పార్టీ నుంచి బహిష్కరించడం పక్కా అని అనుకున్నారు. ఈటలే స్వయంగా పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని భావించారు. అయితే అలా జరగలేదు. ఈటల తనంతట తానుగా రాజీనామా చేయాలని టీఆర్ఎస్ పెద్దలు..పార్టీనే తనను సస్పెండ్ చేయాలని రాజేందర్ ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈటల రాజేందర్ దుందుడుకు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వం తనను ఒంటరి చేసే కుట్రలు చేస్తుంది కాబట్టి..ముందుగా తన వెంట వచ్చే వారెవరో లెక్కలు వేసుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది. అందుకోసం ఆయన కలిసొచ్చే వారందరితో చర్చలు జరుపుతున్నారు. తన నియోజక వర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు పెడుతున్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పిటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లు తనకు దూరం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇక ఈటల వ్యవహారంలో కేసీఆర్ బాణం గురితప్పిందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో కేసీఆర్ కూడా దూకుడు తగ్గించి పక్కాగా ప్రణాళికలు అమలు చేసే పనిలో పడ్డారు. ఈటల వెంట నడిచేవారిని కట్టడి చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆపరేషన్ హుజురాబాద్‌కు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు బాధ్యతలు అప్పగించారు. దాంతో వారంతా ఈటలకు మద్దతు తెలుపుతున్న గ్రామ, మండల, నియోజక వర్గ స్థాయి నేతలు కార్యకర్తలతో రహస్యంగా మంత్రాంగం నడుపుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలో కొనసాగాలని అన్ని రకాలుగా సహాయం చేస్తామని వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్.
దాంతో నిన్నా మొన్నటి వరకు ఈటల వెంట నడిచిన కొందరు నాయకులు ఆయనకు దూరంగా ఉంటున్నారట. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్, తన నియోజక వర్గానికే చెందిన జెడ్పి చైర్ పర్సన్ టీఆర్ఎస్‌లోనే కొనసాగాలని డిసైడ్ అయినట్లు టాక్ నడుస్తోంది. ఇలా ఈటెల వెంట ఉన్న వారిని దూరం చేసేందుకు టీఆర్ఎస్ పెద్దలు పావులు కదుపుతుంటే..నియోజక వర్గంలో పట్టుతగ్గకుండా మాజీ మంత్రి జాగ్రత్తలు తీసు కుంటున్నారు. దాంతో ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియక కొందరు ఇద్దరికీ దూరంగా ఉంటుండగా.. మరికొందరు అటు ఇటు వెళుతూ తమ వెయిట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని చర్చించుకుంటున్నారు.
ఇక బర్తరఫ్ తర్వాత రాజేందర్ ఇంకా ఫ్యూచర్ ప్లాన్ ఎంటో ప్రకటించలేదు. కొత్త పార్టీ పెడతారా? లేక ఇతర పార్టీల్లోకి వెళతారా అనేది స్పష్టత రాలేదు. దాంతో సొంత పార్టీలో చాలా మంది అసంతృప్త వాదులు ఇంకా ఓపెన్ అవ్వడం లేదు. ఈటల కార్యాచరణ ప్రకటించకుండా వెంట నడిచేందుకు వెనుకడుతున్నట్లు తెలుస్తోంది. కేవలం ఇప్పటి వరకు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్, సీనియర్ నాయకురాలు తుల ఉమ ఇద్దరే బహిరంగంగా ఆయనకు మద్దతు ప్రకటించారు. ఆయన దారిలో ఎవరు నడుస్తారు అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. అటు టీఆర్ఎస్ పెద్దలు, ఇటు ఈటెల ఆచితూచి అడుగులు వేస్తుండటంతో తెలంగాణ రాజకీయం రంజుగా మారింది.