ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయాలు వడివడిగా మారుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఎటు జంప్ చేస్తారో చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ఇదే పరిస్థితి తెలుగు మీడియాలోనూ కనిపిస్తోంది. ప్రముఖ మీడియాల్లోని ఇద్దరు కీలక పొజిషన్‌లలో ఉన్న వారు తమ పదవులకు రాజీనామాలు చేయడం మీడియా వర్గాల్లో చర్చకు దారితీసింది. వీటిలో అతి పెద్ద సెర్క్యులేషన్ ఉన్న ఓ పత్రికలో ఏపీ బాధ్యతలు చూస్తున్న ఉన్నతోద్యోగి కొన్నాళ్ల కిందట రాజీనామా చేశారు. ఇది పెద్దగా చర్చకు రాలేదు. అంతర్గత విభేదాల కారణంగా ఆయన తన బాధ్యతల నుంచి వైదొలిగినట్టు ప్రచారంలో ఉంది.
అయితే, ఏపీలోను, తెలంగాణలోనూ దమ్మున్న మీడియాగా ప్రచారం చేసుకునే ఓ మీడియాలో తెలంగాణ పత్రిక బాధ్యతలను భుజాన వేసుకున్న ఓ కీలక అధికారి తాజాగా రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. గడిచిన నాలుగు రోజులుగా ఇరు రాష్ట్రాల మీడియా వర్గాల్లో ఈ విషయం చర్చకు వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యధిక సెర్క్యులేషన్‌తో నడుస్తున్న పత్రికతో తన పాత్రికేయ కృతిని ప్రారంభించిన ఈయన.. తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోనే సంస్థనుంచి బయటకు వచ్చి దమ్మున్న మీడియా వర్గంలో చేరిపోయారు.
తనదైనశైలిలో కాలమ్ కూడా రాస్తూ.. ఆర్ ఎస్ ఎస్ భావజాలాన్ని అణువణువునా నింపుకున్న ఈయన.. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తన వ్యాసాలతో రెచ్చిపోయారనే పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన వాదాన్ని… రచనా పటిమను పలు సందర్భాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ పరోక్షంగా కొనియాడారు. గత తొలి హయాంలో కేసీఆర్‌ను స్వయంగా ఇంటర్వ్యూ చేసిన ఈయన.. అప్పటి నుంచి సీఎంకు టచ్‌లో ఉన్నారు. తర్వాత కాలంలో రాష్ట్రంలో మేధావి జర్నలిస్టుగా గుర్తిస్తూ.. ప్రభుత్వం సత్కారం కూడా చేయడం గమనార్హం. ఈ క్రమంలో దమ్మున్న మీడియాకు గండి కొట్టాలనో.. లేక తన ఆధ్వర్యంలో నడుస్తున్న నమస్తే తెలంగాణకు మరింత ఊపు తేవాలనో.. ఉద్దేశంతో కేసీఆర్ సదరు అధికారికి గేలం వేశారని ప్రచారం జరుగుతోంది.
రేపో మాపో ఆయన నమస్తే తెలంగాణ ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. భారీ ఎత్తున ఓ సీనియర్ ఐఏఎస్ అదికారికి ఇచ్చేవేతనం, బంగళా, కారు సహా ప్రభుత్వ సలహాదారు హోదాతో ఈయనను నియమించుకున్నారని మీడియా వర్గాల్లో చర్చ నడుస్తుండడం గమనార్హం. ఇదిలావుంటే, దమ్మున్న మీడియాలో ప్రింట్ వ్యవస్థను ఇప్పటి వరకు నడిపించిన ఈయన రిజైన్ చేయడంతో పత్రిక ఇప్పటి వరకు చూపించిన ధాటి సన్నగిల్లుతుందా? అనే ఆసక్తికర చర్చ సాగుతోంది.