స్వర్గానికి ఎగరలేనమ్మ.. ఉట్టి పట్టుకుని వేలాడినట్టుగా పరిస్థితి ఉన్నాయి.. రాష్ట్రంలోని విపక్షాల ఆరోపణ లు. సీఎం జగన్ కేంద్రంగా ఏదో ఒక ఆరోపణతో పొద్దు పుచ్చుతున్న ప్రతిపక్షాలకు తాజాగా రెండు విషయాలు దొరికాయి. వీటిలో ప్రధానంగా మూడు రాజధానుల ఏర్పాటు విషయాన్ని పక్కన పెడితే.. రెండోది కేవలం ఐదు రోజుల్లోనే జగన్ తన సొంత జిల్లా కడపకు రూ.100 కోట్లు తరలించారని వివిధ అభివృద్దిపనులు చేపట్టనున్నారని ఈ ఆరోపణల సారాంశం. నిజానికి సీఎంగా ఉన్న వ్యక్తి ఎవరైనా.. సొంత జిల్లాకు ఏం చేసినా.. చేయక పోయినా కూడా వార్తల్లో నిలుస్తుంది.
గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న సమయంలో తన సొంత జిల్లా చిత్తూరుకు ఏమీ చేయలేదనే అపవాదును మూటగట్టుకున్నారు. ఇక, గత ఐదేళ్లలో సీఎంగా ఉన్న చంద్రబాబు.. తన సొంత జిల్లా చిత్తూరుకు భారీ ఎత్తున నిధులు కుమ్మరించారు. ఇక, 2017లో నంద్యాల ఉప ఎన్నిక వచ్చిన సందర్భంలో ఆయన ఇచ్చిన నిధులు అన్నీ ఇన్నీ కాదు. అంతేకాదు. ఆ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు నిధుల కోసం ఎదురు చూస్తున్నా.. కేవలం నంద్యాల నియోజకవర్గంలోని డ్వాక్రామహిళలపై మాత్రం కరుణ చూపించి వారి అకౌంట్లలో నిధులు వేశారు.
అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఇదే విషయాన్నిప్రస్థావించినప్పుడు సోకాల్డ్ పత్రికలు, మీడియా సహా కొన్ని పక్షాలు రాష్ట్రంలో ఏ ప్రాంతానికి నిధులు ఇచ్చినా.. అభివృద్ధే కదా కోరుతున్నారు! అంటూ సన్నాయి నొక్కులు నొక్కి సమర్ధించారు. కానీ, ఇప్పుడు జగన్ ఎలాంటి స్వార్థం లేకుండానే కడపకు నిధులు ఇవ్వడాన్ని మాత్రం ఏదో ఘోరం చేసినట్టు, నేరం చేసినట్టు పెద్ద ఎత్తున వ్యతిరేక కథనాలు ప్రచారం చేస్తుండడం, జగన్ ను మానసికంగా దెబ్బతీయాలనే వ్యూహంలో భాగంగా నే జరుగుతున్నదిగా పేర్కొంటున్నారు విశ్లేషకులు.
కడపకు నిధులు ఇవ్వడంలో తప్పులేదు.. అయితే, అదేసమయంలో మిగిలిన ప్రాంతాలకు ఇస్తే.. బాగుంటుందనే సూచన చేయాల్సిన మీడియా కూడా ప్రతిపక్షం మాదిరిగా వ్యవహరించడమే ఇప్పుడు చర్చకు వస్తున్న ప్రధాన అంశం.