తెలంగాణాలో కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి తెలంగాణా వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. క్వారంటైన్ గడువుని రాష్ట్ర ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. బుధవారం పరీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా 15 కరోనా కేసులు నమోదు అయ్యాయి. రోజు సంఖ్యతో పోలిస్తే ఈ సంఖ్య క్రమంగా తగ్గినట్టే కనపడుతుంది.
రాబోయే రెండు మూడు రోజుల్లో ఇంకా తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ నేపధ్యంలో తెలంగాణా సిఎం కేసీఆర్ బుధవారం రాత్రి 11.30 గంటల వరకు ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి, కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ అమలు తీరుపై ఆయన అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల గురించి ఆయన ఆరా తీసారు. హైదరాబాద్, వికారాబాద్, సూర్యాపేట జిల్లాల గురించి ఆయన వివరాలు అడిగారు.
రెండు మూడు రోజుల్లో కరోనా వ్యాప్తి మరింతగా తగ్గే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో కరోనా సోకిన వారందరినీ గుర్తించామని అన్నారు. వారి ద్వారా ఎవరెవరికి వైరస్ సోకే అవకాశం ఉందో కాంటాక్టు లిస్టు తయారు చేసి పరీక్షలు జరిపామని చెప్పిన కేసీఆర్… రాష్ట్ర వ్యాప్తంగా ఏయే ప్రాంతాల్లో కరోనా వైరస్ సోకిన వారున్నారో ఒక అంచనా దొరికిందన్నారు. దీని ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా కంటైన్మెంట్లు ఏర్పాటు చేశామని చెప్పారు.
అక్కడ ప్రజలను బయటకు రానీయకుండా, బయటి వారిని అక్కడికి వెళ్లకుండా కఠినంగా వ్యవహరించామని అన్నారు కేసీఆర్. కాంటాక్టు వ్యక్తులందరనీ క్వారంటైన్ చేశామన్న ఆయన… దీని కారణంగా వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టగలిగామని అన్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విజయవంతంగా అమలవుతోందని వ్యాఖ్యానించారు. ప్రజలు కూడా సహకరిస్తున్నారని.. మరికొన్ని రోజులు ప్రజలు ఇదే విధంగా సహకరించి లాక్ డౌన్ నిబంధనలను, కంటైన్మెంట్ నిబంధనలు పాటిస్తే కచ్చితంగా ఫలితం ఉంటుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేసారు.