శుక్రవారం ఉదయాన్నే 7 గంటలకల్లా సందడి మొదలైపోయేది… ఇక పెద్ద హీరో సినిమా అంటే.. ఇక చెప్పేదేముంది! సంబరాలు అంబరాన్నంటేవి! ప్రస్తుతం నడుస్తున్న ఈ వేసవి కాలం సంగతైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! కాకపోతే… అదంతా నాడు.. అనుకునే పరిస్థితి నేడు! అవును… కరోనా పుణ్యామాని సినిమా థియేటర్ల వద్ద కర్ఫ్యూ వాతావరణం నెలకొంది! ఈ జనరేషన్ లో ఎవరూ… ఇలాంటి రోజు థియేటర్ల వద్ద చూసి ఉండరు! కరోనా ఇప్పట్లో తగ్గేలా లేదు!! ఒక వేళ ఇంకో రెండు నెలల అనంతరం లాక్ డౌన్ ఎత్తేసినా… అప్పుడే థియేటర్లకు అనుమతి లభించదు! ఈ పరిస్థితుల్లో ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అయిన బొమ్మలు చాలానే ఉన్నాయి! ఈ పరిస్థితుల్లో మళ్లీ తెరపై బొమ్మ పడేదెప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానంగా భిన్నాభిప్రాయాలతో స్పందిస్తున్నారు సినీ పెద్దలు!
“నా ఉద్దేశంలో ఈ ఏడాది డిసెంబరు, వచ్చే ఏడాది జనవరికి కానీ థియేటర్లు ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించడం లేదు” అని అభిప్రాయపడుతున్నారు ఒక బడా నిర్మాత! ఆయన చెప్పారని కాదు కానీ… ప్రస్తుతం కరోనా భయంతో ఉన్న జనం… ధైర్యం చేసి ఇగుంపులు గుంపులుగా కలవడానికి అప్పుడే సిద్దపడరని.. దానికి లాక్ డౌన్ ఎత్తేసిన అనంతరం కనీసంలో కనీసం ఆరునెలలు సమయం పట్టొచ్చని చెబుతున్నారు. ఈ ఎఫెక్ట్ థియేటర్లకే కాదు సుమా… షాపింగ్ మాల్స్ కి, దేవాలయాలని, రెస్టారెంట్లకు… ఇలా చాలా రంగాలపై ఉంటుందనే అనుకోవాలి!
అయితే ఈ క్రమంలో ఇప్పటికే విడుదలకు సిద్దమైన సినిమాల పరిస్థితి ఏమిటి? తెచ్చుకున్న ఫైనాన్స్ కి వడ్డీలు పెరిగిపోతున్నాయి… పోనీ డిజిటల్ మాధ్యమాల్లోనే నేరుగా విడుదల చేద్దామన్నా… నష్టానికి అమ్మాలి తప్ప.. థియేటర్లలో విడుదల చేసినంత సేఫ్ కాదు! పైగా… థియేటర్లలో చూసిన ఫీలింగ్ ఈ డిజిటల్ మాధ్యమాల్లో రాదు కాబట్టి… కొంతమంది పెద్ద హీరోలు వీటికి ససేమిరా అంటున్నారట! దీంతో అన్ని లెక్కలూ కలుపుకుంటే… “అనుకోకుండా ఒక రోజు” సినిమాలో చార్మీకి.. తన ప్రమేయం లేకుండా ఒక రోజు ఎలా గడిచిపోతుందో.. తెలుగు సినిమా ప్రేక్షకుడికి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి కూడా తమ తమ ప్రమేయాలు లేకుండానే… ఒక ఏడాది గడిచిపోతుందన్నమాట! ఇది మామూలు సంక్షోభం కాదు!! ఈ లెక్కన వెండితెరపై బొమ్మ పడాలంటే… ఇంకో 7 – 8 నెలల సమయం పట్టోచ్చన్నమాట!!