నేడు సీఎం కేసీఆర్ వికారాబాద్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రారంభం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ.. ఒంటరి మహిళలు, వృద్ధులకు, భర్తలు చనిపోయిన ఆడవారికి గతంలో కేవలం 200 రూపాయల పెన్షన్ దక్కేదని, ఇప్పుడు రూ.2016 టంచన్‌గా ప్రతినెలా 36 లక్షల మందికి అందిస్తున్నామని కేసీఆర్ అన్నారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం, 57 ఏళ్లు పైబడిన వారికి కూడా పెన్షన్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ వెల్లడించారు. 10 లక్షల పెన్షన్లు మంజూరు చేశామని, కరెంటు బాధలు పోయాయన్నారు సీఎం కేసీఆర్.
గతంలో కరెంటు ఎప్పుడొస్తదో? ఎప్పుడు రాదో? ఎన్ని మోటార్లు కాల్తయో? ఏసిన పంట పండుతదో లేదో తెల్వదన్నారు సీఎం కేసీఆర్. కానీ ఈనాడు వ్యవసాయానికి, పరిశ్రమలకు, దుకాణాలకు, ఇళ్లకు 24 గంటలూ అత్యుత్తమ విద్యుత్ అందించే రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని, మంచి నీళ్ల బాధ పోయింది. కరెంటు బాధ పోయిందన్నారు సీఎం కేసీఆర్. సంక్షేమం చేసుకుంటున్నామని, దివ్యాంగులకు కూడా నెలకు రూ.3016 ఇచ్చి ఆదుకుంటున్నామని, ఆడపిల్లల పెళ్లికి కులమతాలతో సంబంధం లేకుండా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ స్కీంలతో ఆదుకుంటున్నామన్నారు సీఎం కేసీఆర్.