అసెంబ్లీలోనూ అదే పాట.. టార్గెట్ మోదీ..!

-

వేదిక ఏదైనా గాని, సమయం ఏదైనా గాని…పరిస్తితులు ఎలా ఉన్నా గాని… సభ అయినా, ప్రెస్ మీట్ అయినా…కేసీఆర్ టార్గెట్ ఒక్కటే అది..మోదీ. గత కొంతకాలం నుంచి కేసీఆర్‌..మోదీ పేరు తలుచుకోకుండా ఏ కార్యక్రమం మొదలుపెట్టడం లేదు. ఏ కార్యక్రమంలోనైనా మోదీని విమర్శించకుండా ప్రసంగం ముగించడం లేదు. ఇప్పటికే పలుమార్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ కేంద్రంలోని మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. అలాగే పథకాలు, అభివృద్ధి పనుల ప్రారంభ సభలు అయినా సరే కేసీఆర్ టార్గెట్ మోదీ.

అంటే మోదీని విమర్శిస్తేనే నెక్స్ట్ తెలంగాణలో అధికారం దక్కుతుందనే కోణంలో కేసీఆర్ రాజకీయం నడిపిస్తున్నారు. 2014లో తెలంగాణ సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చారు…మళ్ళీ 2018లో అదే ఫార్ములా అంటే కష్టమని చెప్పి…చంద్రబాబుని ఒక బూచిగా చూపించి రాజకీయం చేశారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న చంద్రబాబుని టార్గెట్ చేసి ఎన్నికల ప్రచారం చేశారు. అదిగో మళ్ళీ చంద్రబాబు తెలంగాణలో అడుగు పెడుతున్నారు…మళ్ళీ తెలంగాణని దోచుకుంటారని ప్రజల్ని నమ్మించి రెండోసారి కూడా ఓట్లు వేయించుకుని గెలిచి అధికారంలోకి వచ్చారు.

ఇప్పుడు మూడో సారి అధికారంలోకి రావాలని చూస్తున్నారు…కానీ ప్రభుత్వంపై వ్యతిరేకత బాగా ఉంది…అటు కాంగ్రెస్, ఇటు బీజేపీల వైపుకు ప్రజలు వెళుతున్నారు. మరి ఇలాంటి తరుణంలో కేసీఆర్‌కు ఏ కారణం దొరకడం లేదు. దీంతో కేంద్రంలో మోదీ సర్కార్‌ని టార్గెట్ చేశారు. అదిగో మోదీ వల్ల దేశం నాశనమైపోయింది…ఇంకా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే మాట విద్వేషాలు చెలరేగుతాయని ప్రచారం చేస్తున్నారు.

అలాగే జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి మోదీకి చెక్ పెట్టాలని చూస్తున్నారు. అందుకే ఇప్పుడు ఎక్కడా చూసిన మోదీ గురించే మాట్లాడుతున్నారు. ఇక విచిత్రమైన విషయం ఏంటంటే…తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో కూడా మోదీ ప్రస్తావన తీశారు. మోదీ..మోస్ట్ ఫాసిస్ట్ ప్రధాని అని, మన మండలాలు, సీలేరు ప్రాజెక్టు గుంజుకున్నారని, అలాగే ఎప్పటిలాగే వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారంటూ మోదీపై కేసీఆర్ ఫైర్ అయ్యారు.

ఇటీవల ఏపీకి తెలంగాణ వడ్డీతో కలుపుకుని రూ. 6 వేల కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లిచాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ.. ఏపీ నుంచి రూ.17828 కోట్లు తెలంగాణకే రావాలని, వీటిని కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పించడం లేదని ఫైర్ అయ్యారు. తాను చెప్పేది అబద్దమైతే సీఎం పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. మొత్తానికి ఏ వేదిక అయినా సరే కేసీఆర్ టార్గెట్ మోదీనే.

Read more RELATED
Recommended to you

Exit mobile version