ధరణి పోర్టల్ ప్రారంభానికి ముహుర్తం ఖరారైంది. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకి తెలంగాణ ధరణి పోర్టల్ ప్రారంభం కానుంది. మేడ్చల్ జిల్లాలో ధరణి పోర్టల్ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. సమీకృత భూ రికార్డ్‌ల యాజమాన్య విధానం ధరణిని అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంది. భూ రికార్డ్‌లన్నింటిని ఆన్లైన్లోకి మార్చుతోంది.. భూ పరిపాలన, రిజిస్ట్రేషన్ సేవలు రెండింటిని అనుసంధానం చేసే అధునాతన భూ రికార్డుల నిర్వహణ వ్యవస్థని రూపొందిస్తుంది.
పోర్టల్ ద్వారా ప్రజలకు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ సేవలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందించాడానికి అధికారులు సిద్ధమయ్యారు. ధరణి పోర్టల్ పై రెవెన్యూ అధికారులకు శిక్షణా కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ధరణి పోర్టల్ పనితీరుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రెవెన్యూ అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్లాట్ బుకింగ్ , సిటిజన్ ఓపెన్ పోర్టల్ సక్సెసర్ మాడ్యూల్స్, పార్టిషన్ మాడ్యూల్స్‌పై వివరించారు. ధరణి టెక్నికల్ సమస్యల పరిష్కారానికి రాష్ట్రస్థాయిలో ఏర్పాటుచేసే కంట్రోల్ రూంతో పాటు జిల్లాస్థాయి టెక్నికల్ సపోర్ట్ టీంలు పనిచేయనున్నాయ్.