ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గిరిజన ఆదివాసి జాతర మేడారం మహా జాతరకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది. ఈనెల 23వ తేదీన రేవంత్ రెడ్డి మేడారం జాతరకు వెళ్లనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించనున్నాయి. శుక్రవారం రోజు సీఎం రేవంత్ రెడ్డి వనదేవతలను దర్శించుకోనున్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మేడారం జాతరకు వెళ్లడం ఇదే తొలిసారి.
ఇక మేడారం మహాజాతర బుధవారం అట్టహాసంగా ప్రారంభం అయింది. సారలమ్మ, పగిడిద్దరాజు గద్దెలకు చేరుకున్నారు. ఇవాళ సమ్మక్క చేరుకోనుంది. వనదేవతలకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నిన్న తొలి రోజే మేడారం ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. తెలంగాణతో పాటు ఇతర రాస్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఇప్పటికే అన్నీ ఏర్పాట్లనీ పూర్తి చేసింది. జాతర వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసారు. మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ దగ్గర ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.