లక్షలాదిమంది భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది.. మాఘశుద్ధ పున్నమి వెన్నెల్లో సమ్మక్క సారక్క దేవతలు గద్దెలపై కొలువుదీరే గడియలు వచ్చేశాయి. బుధవారం రాత్రి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ఆగమనం పూర్తయింది. ఆదివాసి ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించి కాన్నేపల్లి నుండి సారలమ్మ ను, పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు ప్రతిరూపాలను తీసుకు వచ్చి గద్దెలపై ప్రతిష్టించారు.
ఈ జాతరలో అతి ముఖ్యమైన ఘటం ఈరోజు ఆవిష్కృతం కానుంది.. చిలకలగుట్ట నుండి సమ్మక్కను గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్టిస్తారు..ఆదివాసి ఆచార సాంప్రదాయాల ప్రకారం చిలకలగుట్టపై పూజలు నిర్వహించి అక్కడినుండి గద్దెల పైకి తీసుకొచ్చి ప్రతిష్టిస్తారు. అయితే సమ్మక్క రాక సందర్భంగా జిల్లా ఎస్పీ 10 రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి అధికారిక లాంచనాలతో సమ్మక్క దేవతకు స్వాగతం పలకడం ఇక్కడ ఆనవాయితీ.
జిల్లా కలెక్టర్ ఎదురెళ్లి సమ్మక్క పూజారులకు పట్టు వస్త్రాలు సమర్పించి వారికి స్వాగతం పలుకుతారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి పూజారులకు స్వాగతం పలకడం జాతరలో కొనసాగుతున్న ఆనవాయితీ. సమ్మక్క ను గద్దెల పైకి తీసుకురావడం కోసం మూడంచెల పోలీసు భద్రతతో ప్రత్యేక రోప్ పార్టీని సిద్ధం చేశారు..