రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ బుధవారం అమరావతిలో చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. సొంత నిర్ణయాలను పార్టీలకు ఆపాదించడం తగదని టీజీకి వార్నింగ్ ఇచ్చారు. టీజీ మీడియాతో మాట్లాడుతూ.. తెదేపా, జనసేన మధ్య పెద్దగా విభేదాలు లేవన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ కలిసినప్పుడు ఏపీలో తెదేపా, జనసేన కలిస్తే తప్పేంటని టీజీ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై సీఎం స్పందిస్తూ..ప్రజలను సందిగ్దంలో పెట్టోద్దు..మీ లాంటి వ్యక్తి అలా మాట్లాడటం తగదంటూ.. టీజీ వెంకటేశ్ ని మందలించారు. అదే స్థాయిలో పాడేరులో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ.. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వదిలే ప్రసక్తి లేదన్నారు.. నాడు జనసేన వద్దనుకుంటే టీజీ కి రాజ్యసభ సీటు ఇచ్చారని గుర్తు చేశారు.
వెంకటేష్ పెద్ద మనిషిగా మాట్లాడాలని.. లేదంటే తాను నోరు అదుపుతప్పి మాట్లాడతానని హెచ్చరించారు. కిడారి, సోమ లు చనిపోవడానికి కారణం చంద్రబాబేనని ఆరోపించారు. ఇదిలా ఉంటే అసలు టీజీ వెంకటేశ్ ఎందుకు అలా మాట్లాడారో అనే విషయాన్ని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వైసీపీ వైపు చూస్తున్నాడా?
మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డితో కలిసి టీజీ వెంకటేశ్ చంద్రబాబుని ఆయన నివాసంలో కలిసి కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో సర్వే నివేదికల బట్టే నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. సర్వేల్లో తన కుమారుడు టీజీ భరత్‌కు ఎక్కువ ప్రజాదరణ వస్తే కర్నూలు అసెంబ్లీ టికెట్ ఆయనకే ఇవ్వాలని కోరారు. తాజా వ్యాఖ్యల నేపథ్యంలో తన కుమారుడు, ఆయనకు సీటు విషయంలో వైసీపీ వైపు టీజీ మొగ్గు చూపుతున్నారంటూ కొంత మంది విశ్లేషిస్తున్నారు.