ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం ప్రభుత్వం పరువు పోయే విధంగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సొంత బావ రామకోట సుబ్బారెడ్డి వైసీపీలో తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బుధవారం లోటస్ పాండ్ లో సుబ్బారెడ్డికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గత కొద్ది రోజులుగా సుబ్బారెడ్డికి సోమిరెడ్డితో ఆస్తి వివాదం నడుస్తుండటంతో పాటు, జిల్లాలో కొంత మంది నేతల తీరు నచ్చక పోవడంతో ఆయన పార్టీ మారినట్లు సమాచారం. సుబ్బారెడ్డి అసంతృప్తిని గమనించి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంత్రాంగం నడిపారు. దీంతో సంక్రాంతి సమయంలో ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరిపి జగన్ తో మాట్లాడించగా ఆయన పార్టీ మారేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైయస్ఆర్సీపీలో చేరిన ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బావ రామకోట సుబ్బారెడ్డి, ఆయన కొడుకులు శశిధర్రెడ్డి, కళాధర్ రెడ్డి.#APNeedsYSJagan #RavaliJaganKavaliJagan pic.twitter.com/Pe1hl3POCk
— YSR Congress Party (@YSRCParty) January 23, 2019
సుబ్బారెడ్డితో పాటూ ఆయన ఇద్దరు కుమారులు శిధర్‌రెడ్డి, కళాధర్‌రెడ్డి కూడా వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో అటు సోమిరెడ్డి కుటుంబంలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చకొనసాగుతోంది. ప్రజా సంకల్ప యాత్రను ముగించిన జగన్ లోటస్ పాండ్ వేదికగా తన రాజకీయ చతురతను ప్రదర్శించడంతో ఏపీలోని అధికార పక్షానికి ముచ్చెమటలు పడుతున్నాయంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.