రాజధాని తరలింపు పై స్పీడ్ పెంచిన జగన్..అధికారుల్లో మొదలైన అలజడి

-

మూడు రాజధానులపై సీఎంజగన్ అసెంబ్లీలో ప్రకటన చేసింది మొదలు అదిగో.. ఇదిగో అనే చర్చ జరుగుతూనే ఉంది. కోర్టుల అడ్డంకులు,కరోనా ఇలా ఏదో ఒక చిక్కుముడితో అడ్డంకులు ఎదురయ్యాయి. ఇటీవల మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని విజయం సాధించిన తర్వాత పరిపాలనా రాజధాని తరలింపు పై సీఎం జగన్ స్పీడ్ పెంచినట్టు కనిపిస్తోంది. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లతోపాటు విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్లను వైసీపీ గెల్చుకున్న క్రమంలో ప్రభుత్వ పెద్దలు ఇంకో ఆలోచన చేయకపోవచ్చనే చర్చ మొదలైంది.ఇంకో ఏడాది పడుతుందని లెక్కలేసిన అధికారుల్లో కూడా పరిపాలనా రాజధాని తరలింపు పై హడావిడి మొదలైంది.

విశాఖకు పరిపాలన రాజధాని తరలింపు నిన్న మొన్నటి వరకు కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున ఇప్పట్లో సాధ్యం కాదని అధికారులు భావించారట. కొందరు మంత్రులు సైతం ఆంతరంగిక సంభాషణల్లో ఇంకా ఏడాది పట్టొచ్చని అభిప్రాయపడిన సందర్భాలూ ఉన్నాయి. కానీ.. మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల చేసిన కామెంట్స్‌తో అందరి అంచనాలు పటాపంచలయ్యాయి. కోర్టులను ఒప్పిస్తామని చెబుతూనే.. ఏ క్షణంలోనే సరే విశాఖకు పరిపాలనా రాజధానిని తరలించేందుకు సిద్ధంగా ఉన్నామన్నది మంత్రి బొత్స ప్రకటన. ఈ స్టేట్‌మెంటే రాజకీయ వర్గాలతోపాటు ఏపీ సచివాలయంలోనూ చర్చకు కారణమైంది.

ఇప్పటికిప్పుడు సచివాలయాన్ని విశాఖకు తరలించడం సాధ్యమా అని కొందరు అధికారులు లెక్కలేస్తున్నారట. కొన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికారులు మాత్రం ముందు జాగ్రత్త పడుతున్నారట. విశాఖలో తమ కార్యాలయాల ఏర్పాటుకు కావాల్సిన భవనాలు, వసతికి సంబంధించి ఇప్పటి నుంచే అన్వేషణ మొదలుపెట్టారట. తమ శాఖలకు సంబంధించి విశాఖలో అందుబాటులో ఉన్న భవనాలు, అక్కడి సదుపాయాల గురించి ఆరా తీస్తున్నట్టు సమాచారం. కేవలం ఫోన్‌లో అక్కడి అధికారులతో మాట్లాడటమే కాకుండా తమ కిందిస్థాయి ఉద్యోగులను వైజాగ్‌కు పంపించి చూసి రమ్మంటున్నారట. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయట.

భవనాల అన్వేషణ కోసం ఉన్నతాధికారుల ఆదేశాలతో విశాఖ వెళ్తున్న సిబ్బంది ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. రాజధాని తరలింపు అంశం కోర్టులో పెండింగ్‌లో ఉండగా తాము విశాఖ వెళ్లినట్టు తెలిస్తే.. అది బయటకు లీకైతే తమకు లేనిపోని ఇబ్బందులు వస్తాయని బెదిరిపోతున్నారట ఉద్యోగులు. అటు పై అధికారులు చెప్పినట్టు చేయకపోయినా ఇటు కోర్టుల నుంచి ఏదైనా ఇబ్బంది వచ్చినా ఇరకాటంలో పడతామని ఆందోళన చెందుతున్నారు. అన్ని సవ్యంగా ఉంటే ఈ ఉగాదికే రాజధాని తరలింపు ముహుర్తం ఫిక్స్ కావచ్చని సచివాలయ అధికారుల్లో చర్చ జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version