మార్చి 1 నుంచి దేశంలో రెండో దశ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్న విషయం విదితమే. అందులో భాగంగానే 27 కోట్ల మందికి ఈ దశలో కోవిడ్ టీకాలను ఇవ్వనున్నారు. 60 ఏళ్లకు పైబడిన వారితోపాటు 45 ఏళ్లకు పైబడి ఉండి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ దశలో టీకాలను ఇస్తారు. ప్రభుత్వ హాస్పిటళ్లు, ఆరోగ్య కేంద్రాలతోపాటు మార్చి 1 నుంచి పౌరులు ప్రైవేటు హాస్పిటల్స్ లోనూ కోవిడ్ టీకాలను తీసుకోవచ్చు. కాగా మార్చి 1వ తేదీ ఉదయం 9 నుంచి కో-విన్ యాప్‌ను కూడా ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్లు తెలిసింది.
కో-విన్ యాప్ నిజానికి కొత్త యాప్ ఏమీ కాదు. జనవరి 16వ తేదీ నుంచి మొదటి వ్యాక్సినేషన్ ప్రారంభం అయినప్పటి నుంచి దీన్ని ఉపయోగిస్తున్నారు. అయితే మార్చి 1 నుంచి పౌరులకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు కనుక శని, ఆదివారాల్లో వ్యాక్సినేషన్‌ను నిలిపివేశారు. ఈ రెండు రోజుల్లో ఈ యాప్‌ను అప్‌గ్రేడ్ చేశారు. దీంతో మార్చి 1 నుంచి ఈ యాప్ పౌరులకు కూడా అందుబాటులోకి రానుంది. ఇందులో ముందుగా రిజిస్టర్ చేసుకున్న వారు కోవిడ్ టీకాలను తీసుకోవచ్చు.
అయితే ఆరోగ్య సేతు యాప్‌లోనూ కో-విన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు cowin.gov.in అనే సైట్‌లోకి వెళ్లి కూడా కోవిడ్ టీకా కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక కో-విన్ (Co-win) యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. అందులో రిజిస్టర్ చేసుకునే ప్రభుత్వం ఇచ్చిన ఏదైనా గుర్తింపు కార్డును చూపించాలి. తరువాత ఓటీపీ వస్తుంది. దాన్ని కన్‌ఫాం చేస్తే చాలు, యాప్ లో రిజిస్టర్ అవుతుంది. తరువాత పౌరులు తాము ఎంచుకున్న హాస్పిటల్ లేదా కేంద్రానికి వెళ్లి అక్కడ ఐడీ ప్రూఫ్ చూపించి కోవిడ్ టీకాను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా కుటుంబంలో ఎంత మందిని అయినా రిజిస్టర్ చేయవచ్చు. ఇక ప్రైవేటు హాస్పిటల్స్ వారు కోవిడ్ ఒక్క డోసుకు రూ.250 మాత్రమే తీసుకోవాలి. అంతకన్నా ఎక్కువ చార్జి వసూలు చేయరాదు.