సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించే పోస్టుల్లో ఎక్కువ శాతం బరువు తగ్గడం గురించే ఉంటాయి. అంతకుముందు అలా, ఇప్పుడు ఇలా అన్న పేరుతో శరీరాకృతులను చూపుతూ, ఈ ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఇలా అయ్యానని ప్రచారాలు కనిపిస్తుంటాయి. దాన్ని చూసి తాము కూడా అలా అవ్వాలన్న ఆలోచనతో బరువు తగ్గాలన్న ప్రయత్నం మొదలు పెడతారు. కానీ అక్కడే కొని పొరపాట్లు చేస్తుంటారు. బరువు తగ్గాలనుకునే వారు సాధారణంగా చేసే కొన్ని పొరపాట్లేమిటో ఇక్కడ తెలుసుకుందాం.
ఆహారం తినకపోవడం
బరువు తగ్గాలనుకునే ప్రతీ ఒక్కరూ చేసే పొరపాటు ఇది. ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్లే బరువు పెరుగుతున్నారన్న ఉద్దేశ్యంలో తక్కువ కేలరీలు తీసుకుందామని ఒకపూట అన్నం మానేస్తారు. రోజూ రెండు పూటలు మాత్రమే తింటారు. దీనివల్ల జీవక్రియ పనితీరు దెబ్బతింటుంది. జీవక్రియ సరిగ్గా జరగకపోతే శరీరం సరిగ్గా స్పందించదు. అదీగాక, ఆహారం తీసుకోకపోవడం వల్ల బరువు తగ్గితే, ఆ తర్వాత చాలా తొందరగా బరువు పెరుగుతారు.
ప్రొటీన్ ఎక్కువగా తీసుకోకపోవడం
ప్రోటీన్ ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల చాలా నష్టాలు వస్తాయి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, బరువు తగ్గించడంలో ప్రోటీన్ పాత్ర కీలకం. ఆకలిని తగ్గిస్తుంది. కేలరీలు ఎక్కువగా తీసుకోవడాన్ని తగ్గిస్తుంది. జీవక్రియ పనితీరును పెంచుతుంది. అందుకే బరువు తగ్గడంలో హై ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని సలహా ఇస్తారు.
ఫ్రూట్ జ్యూస్ తాగడం
చక్కెర తీసుకోవద్దన ఉద్దేశ్యంతో కూల్ డ్రింక్స్ మానేసి ప్యాక్ చేసిన ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడం కరెక్ట్ కాదు. దాన్లో కూడా చక్కెర శాతం ఉంటుంది. దాని బదులు రోజుకి 4లీటర్ల నీళ్ళు తాగండి.
సరైన నిద్ర లేకపోవడం
నిద్ర సరిగా లేకపోవడం వల్ల హార్మోన్లలో మార్పులు వచ్చి, ఆకలి మీద ప్రభావం చూపుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు నిద్రకి కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. లేదంటే ఎంత డైట్ పాటించినా దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు.