దేశంలో ఉన్న కోవిడ్ టీకాల కొరత కారణంగా కంపెనీలు, పరిశ్రమలు తమ తమ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే టీకాలను ఇవ్వాలని, వారి కుటుంబ సభ్యులకు టీకాలను ఇవ్వకూడదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. అయితే ఆ ఆదేశాలను సదరు మంత్రిత్వ శాఖ వెనక్కి తీసుకుంది. దీంతో కంపెనీలు తమ ఉద్యోగులకు చెందిన కుటుంబ సభ్యులకు కూడా టీకాలను ఇవ్వవచ్చు.
ఉద్యోగుల కుటుంబ సభ్యులకు టీకాలను ఇవ్వకూడదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం కంపెనీలు ఆ విషయాన్ని సదరు మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లాయి. దీంతో కంపెనీలతో చర్చించిన ఆ మంత్రిత్వ శాఖ పై విధంగా నిర్ణయం తీసుకుంది. కంపెనీలు, పరిశ్రమలు తమ ఉద్యోగులకు చెందిన కుటుంబ సభ్యులకు కూడా టీకాలను ఇవ్వవచ్చని తెలిపింది.
కాగా ఇప్పటికే పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు టీకాలను వేయించే కార్యక్రమాలను ప్రారంభించాయి. అయితే ఉద్యోగులతోపాటు వారి కుటుంబ సభ్యులకు కూడా టీకాలను వేస్తే టీకాలకు కొరత ఏర్పడుతుందని, కనుక కంపెనీలు ఉద్యోగులకు మాత్రమే టీకాలు వేయాలని, వారి కుటుంబ సభ్యులకు టీకాలను వేయరాదని ఆ మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చింది. అయితే స్వల్ప వ్యవధిలోనే ఆ మంత్రిత్వ శాఖ ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోవడం గమనార్హం. ఇక దేశంలో చాలా చోట్ల 18-44 వయస్సు ఉన్నవారికి టీకాలను ఇవ్వడం లేదు. టీకాలకు డిమాండ్ ఏర్పడడం, కొరత భారీగా ఉండడంతో ఆ ఏజ్ గ్రూప్ వారికి టీకాలను ఇవ్వడం లేదు. కానీ రానున్న 3 నెలల్లో టీకాల కొరత సమస్య తీరుతుందని తెలుస్తోంది.