టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పై హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. నటి కరాటే కల్యాణి, పలు హిందూ సంఘాలు ఆయనపై ఫిర్యాదు చేశాయి. ‘హరేరామ హరేకృష్ణ’ మంత్రాన్ని ‘ఓ పారి’ అనే ఆల్బమ్‌లో ఐటెం సాంగ్‌గా చిత్రీకరించారని, దేవిశ్రీ ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాయి.
పవిత్రమైన ఆ మంత్రాన్ని అశ్లీల దుస్తులు, నృత్యాలతో చిత్రీకరించి దేవిశ్రీ ప్రసాద్ హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆరోపించాయి. వెంటనే ఆ గీతంలో వినిపించే మంత్రాన్ని తొలగించాలని డిమాండ్ చేశాయి. స్వీయ సంగీత దర్శకత్వంలో దేవిశ్రీ ప్రసాద్ నటించిన ఆల్బమ్ ఇది. ఈ పాట పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో అక్టోబరులో విడుదలైంది. తెలుగులో ‘ఓ పిల్లా’ పేరుతో వచ్చింది. టీ సిరీస్ సమర్పణలో వచ్చిన ఈ పాట ప్యాన్ ఇండియా స్థాయిలో దేవీ శ్రీ ప్రసాద్ కు మొదటిది కావడం గమనార్హం.