నేడు ఉదయం గుజరాత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికే బీజేపీ నేతలు మ్యాజిక్ ఫిగర్‌ను క్రాస్‌చేసి విజయ దుందుభి మ్రోగించారు. అయితే.. తాజాగా ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తిగా ముగిసింది. అధికార బీజేపీ 156 స్థానాల్లో విజయ భేరి మ్రోగించినట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. గత ఎన్నికల్లో 99 సీట్లకే పరిమితమైన బీజేపీ, ఈసారి తిరుగులేని విజయాలతో కాంగ్రెస్ ను మట్టికరిపించింది. కాంగ్రెస్ పార్టీకి 17 స్థానాలు దక్కగా, తొలిసారి గుజరాత్ బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ 5 స్థానాలు చేజిక్కించుకుంది. ఇతరులు 4 స్థానాల్లో నెగ్గారు. గుజరాత్ అసెంబ్లీ బరిలో బీజేపీ నెగ్గడం ఇది వరుసగా ఏడోసారి.
1995 నుంచి కమలనాథులు ఇక్కడ ఎదురులేని ప్రస్థానం కొనసాగిస్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అయితే, పంజాబ్ లో సంచలన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ బరిలో దిగడంతో ఓట్లు చీలే అవకాశం ఉంటుందని, బీజేపీకి నష్టం జరగొచ్చని అంచనా వేశారు. అయితే, అంచనాలను తల్లకిందులు చేస్తూ బీజేపీ భారీ సంఖ్యలో సీట్లను గెలుచుకుని మరోసారి ప్రభుత్వ పీఠాన్ని ఖాయం చేసుకుంది. గతంలో వరుసగా ఏడు సార్లు నెగ్గిన ఘనత సీపీఎం పార్టీకి ఉంది. పశ్చిమ బెంగాల్ లో ఆ పార్టీ వరుసగా 7 పర్యాయాలు అధికారం చేజిక్కించుకుంది. ఇప్పుడా రికార్డును
బీజేపీ సమం చేసింది.