కరోనా బారినపడిన దేశాధినేతల జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చేరిపోయిన సంగతి తెలిసిందే. తొలుత బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆ తర్వాత బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సోనారో వైరస్ బారిన పడి కోలుకున్నారు. బిడెన్‌లా నేను మాస్క్ ధరించను.. ఆయనను ఎప్పుడైనా చూడండి.. మాస్క్ వేసుకునే కనిపిస్తారు. అంటూ డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్‌ను ఎగతాళి చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా కరోనా బారిన పడటం తెలిసిందే. ట్రంప్‌తోపాటు ఆయన భార్య మెలానియా ట్రంప్‌కు కూడా కరోనా బారినపడిన సంగతి తెలిసిందే.. వీరిరువురు కూడా చికిత్స కోసం దవాఖానలో చేరిన విషయం విధితమే.
అయితే డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతుండటం గమనార్హం. ట్రంప్ ఆరోగ్య పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉన్నదని అతడికి వైద్య సేవలు అందిస్తున్న వారిలో ఒకరు తెలిపారు. రాబోయే రెండు రోజులు అత్యంత కీలకమని చెప్పారు. అంతేకాకుండా శుక్రవారం ట్రంప్ దవాఖానలో చేరడానికి ముందు వైట్‌హౌస్‌లో కృత్రిమంగా ఆక్సిజన్ పెట్టాల్సి వచ్చిందని వెల్లడించారు. తన పేరును బయటకు చెప్పడానికి ఆ వ్యక్తి ఇష్టపడలేదు. మరోవైపు, ట్రంప్ మెడికల్ టీం సభ్యుడు సీన్ కోన్లే శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అధ్యక్షుడి ఆరోగ్యం బాగానే ఉందని, జ్వరం లక్షణాలు లేవని తెలిపారు. ట్రంప్‌కు రెమ్‌డెసివిర్‌తో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.