షార్జాలో శనివారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 16వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఢిల్లీ ఘన విజయం సాధించింది. ఢిల్లీ ఉంచిన 229 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కతా వెనుకబడింది. అయినప్పటికీ స్కోరు బోర్డును కోల్‌కతా బ్యాట్స్‌మెన్ కొద్ది సేపు పరుగులు పెట్టించారు. ఓ దశలో కోల్‌కతా గెలుస్తుందనే అనుకున్నారు. కానీ చేయాల్సిన పరుగులు భారీగా ఉండడంతో ఢిల్లీ విజయం సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఢిల్లీ బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్లలో శ్రేయాస్ అయ్యర్ (88 పరుగులు నాటౌట్, 7 ఫోర్లు, 6 సిక్సర్లు), పృథ్వీ షా (66 పరుగులు, 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రిషబ్ పంత్ (38 పరుగులు, 5 ఫోర్లు, 1 సిక్సర్)లు రాణించారు. కోల్‌కతా బౌలర్లలో రస్సెల్ 2 వికెట్లు తీయగా, వరుణ్, నాగర్‌కోటిలు చెరొక వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 210 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ జట్టు కోల్‌కతాపై 18 పరుగుల తేడాతో గెలుపొందింది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్లలో రాణా (58 పరుగులు, 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇయాన్ మోర్గాన్ (44 పరుగులు, 1 ఫోర్, 5 సిక్సర్లు), త్రిపాఠి (36 పరుగులు, 3 ఫోర్లు, 3 సిక్సర్లు)లు ఆకట్టుకున్నారు. ఢిల్లీ బౌలర్లలో నోర్జె 3 వికెట్లు పడగొట్టగా, పటేల్ 2 వికెట్లు తీశాడు. రబాడా, స్టాయినిస్, మిశ్రాలకు తలా 1 వికెట్ దక్కింది.