వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడులు ఇద్దరూ మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. ఆ ఇద్దరి మధ్య రాజకీయ వైరం ఉన్నా వ్యక్తిగతంగా మాత్రం స్నేహితులే. ఆ ఇద్దరి స్నేహంపై ఓ సిరీస్ తెరకెక్కించనున్నట్లు ప్రకటన వచ్చింది. గతంలో చదరంగం అనే ఒక వెబ్ సిరీస్ తీసిన రాజ్ అనంత దీనిని డైరెక్ట్ చేయనుండగా ఎన్టీఆర్ బయోపిక్ నిర్మించిన నిర్మాత విష్ణు ఇండూరి, మరో నిర్మాత తిరుమల రెడ్డితో కలిసి ఈ సిరీస్ తెరకెక్కించనున్నారు. ఈ సిరీస్ రెండు భాగాలుగా రానుందని ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ ఇద్దరు నేతల రాజకీయ అరంగేట్రం నుండి, స్నేహం మరియు వైరం వంటి విషయాలనే మెయిన్ పాయింట్ గా తీసుకుని తెరకెక్కిస్తున్నట్టు పేర్కొన్నారు. ఐతే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటన ఇప్పుడు వివాదానికి దారి తీసింది. ప్రస్థానం డైరెక్టర్ దేవా కట్టా ఈ ప్రాజెక్ట్ ని ఉద్దేశిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ సిరీస్ ఆలోచన తనదన్న ఆయన ఇప్పటికే విష్ణు ఇండూరి తన స్క్రిప్ట్ దొంగతనం చేసి ఒక డిజాస్టర్ ఇచ్చారని ఎన్టీఆర్ బయోపిక్ ని పరోక్షంగా ప్రస్తావించారు. అలాగే మళ్ళీ అలాంటి డిజాస్టర్ ని రిపీట్ కానియ్యనని పేర్కొన్నాడు. అవసరమైతే దాని కోసం లీగల్ గా వెళ్తానని పేర్కొన్నారు. అయితే ఈ రెండు ఐడియాలు తనవని నిర్మాత విష్ణు అంటున్నారు, తన ఐడియాలని ఆయన ఐడియాలుగా ఎందుకు చెప్పుకుంటున్నారో తెలీదని అన్నారు.