మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన విషయం తెల్సిందే. దీంతో హుజూరాబాద్‌లో త్వరలోనే ఉపఎన్నిక జరగనుంది. ఈ ఉపఎన్నికపై అధికార టీఆర్ఎస్, బీజేపీలు ఇప్పటికే ప్రచారం కొనసాగిస్తున్నాయి. ఇక తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ (congress) దృష్టి పెట్టింది. తాజాగా హుజూరాబాద్‌కు నియోజకవర్గానికి ఇన్‌ఛార్జులను నియమించింది. అలానే మండలాలు, మున్సినిపాలిటీలకు కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇన్‌ఛార్జులను నియమించారు.
హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌ఛార్జుగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నర్సింహను నియమించారు. ఎన్నికల కో ఆర్డినేటర్లుగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లను నియమించారు. మండలాల వారీగా చూస్తే వీణవంకకు ఆది శ్రీనివాస్, సంగీతం శ్రీనివాస్, జమ్మికుంటకు విజయ రమణారావు, రాజ్‌ఠాగూర్, హుజూరాబాద్‌కు టి.నర్సారెడ్డి, లక్ష్మణ్‌కుమార్, ఇల్లందకుంటకు నాయిని రాజేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కమలాపూర్‌కు కొండా సురేఖ, దొమ్మటి సాంబయ్యలు ఇన్‌ఛార్జులుగా వ్యవహరించనున్నారు. హుజూరాబాద్ మున్సినిపాలిటీకి బొమ్మ శ్రీరాం, జువ్వాడి నర్సింగరావు, జమ్మికుంట మున్సినిపాలిటీకి సిరిసిల్ల రాజయ్య, ఈర్ల కొమరయ్యను ఇన్‌ఛార్జులుగా నియమించారు.