తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రికత్త వాతావరణం నెలకొన్నది. కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడంతో తోపులాట జరిగింది. మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, సీనియర్ నాయకులు విక్రమ్‌గౌడ్, రాములు నాయక్ లను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. వారిని తరలిస్తుండగా కార్యకర్తలను పోలీసులను నిలువరించడంతో కార్యకర్తలను చెదరగొట్టారు.
అయినప్పటికీ దశల వారిగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రగతి భవన్ ముట్టడికి వస్తున్నారు. ప్రగతి భవన్ కంచెను కూడా తాకేందుకు వీలు లేకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లను చేశారు. మలక్ పేటలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్‌రెడ్డి రంగారెడ్డి ఇంటిని పోలీససులు చుట్టుముట్టడంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అదే విధంగా తెలంగాణ వ్యాప్తంగా ముట్టడికి బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడా అరెస్టులు చేస్తున్నారు. పోలీసు స్టేషన్లలోనే కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు చేస్తున్నారు.
ప్రగతిభవన్ ని ముట్టడికి ప్రయత్నించిన ఎన్.ఎస్.యు.ఐ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికులు కూడా ముట్టడికి ఎత్నించడంతో వారిని అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
శాసనమండలి పక్షనేత షబ్బీర్ అలీ, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో పాటు పలువురు నేతలను గృహ నిర్భందం చేశారు. ఆదివారం రాత్రి నుంచి మల్కజీగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆచూకి లేకపోవడంతో ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రగతి భవన్ పరిసర ప్రాంతాల్లోని హోటళ్లల్లో రేవంత్ రెడ్డి కోసం పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.
తన అనుచరుల ఇళ్లను కూడా పోలీసులు చుట్టు ముట్టారు. ఏ సమయంలోనైనా ప్రగతి భవన్ ముట్టడి చేయవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. దీంతో రేవంత్ రెడ్డి ఎక్కడున్న అరెస్టు చేయాలని పోలీసులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
ఆర్టీసీకార్మికుల సంక్షోభాన్ని పరిష్కరించడానికి ముఖ్యమంత్రికి అక్టోబర్ 19 ను గడువుగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కానీ ఇప్పటి వరకూ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో గతంలో ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం ప్రగతి ముట్టడి చేసేందుకు కాంగ్రెస్ సన్నద్దమౌతుంది. అయితే, ముఖ్యమంత్రి తన మొండి వైఖరిని మార్చుకునే మానసిక స్థితిలో లేరని ఆ పార్టీ నేతలు సమావేశం చర్చించినట్లు తెలిసింది. శనివారం ఉదయం 10.30 గంటలకు ఉద్యోగులతో చర్చలు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరిన హైకోర్టు ఆదేశాలను కెసిఆర్ ప్రభుత్వం బహిరంగంగా ధిక్కరించింది. పైగా తమకు తీర్పు కాపీ అందలేదని ప్రభుత్వం బుకాయిస్తున్నది. వారం రోజుల క్రితం హైకోర్టు ఆదేశించినప్పటికీ ఆయన ఆర్టీసీకి పూర్తి స్థాయి మేనేజింగ్ డైరెక్టర్‌ను నియమించలేదు.