‘భారత్ జోడో యాత్ర’ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మొన్నటికి మొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధరించిన టీషర్టు ధర.. ఆయన ఓ పాస్టర్‌ను కలవడంపై రెండు పార్టీల నేతలు పరస్పరం విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. రాహుల్‌పై మరోసారి వాగ్బాణాలు సంధించారు. ఆమె ఆరోపణలు తప్పని రుజువు చేస్తూ కాంగ్రెస్ పార్టీ వీడియోతో కౌంటర్ ఇచ్చింది.
తమిళనాడులోని కన్యాకుమారి నుంచి రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో ఆయన స్వామి వివేకానంద విగ్రహాన్ని సందర్శించకుండా అగౌరవపర్చారంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు.
నిజానికి జోడో యాత్రకు ముందు రాహుల్.. కన్యాకుమారిలోని వివేకానందుడి విగ్రహాన్ని సందర్శించి ఆయనకు నివాళులర్పించారు. దీంతో స్మృతి ఇరానీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ దీటుగా బదులిచ్చింది. ఆమె వీడియోకు.. రాహుల్ వివేకానందుడి విగ్రహానికి నమస్కరిస్తున్న వీడియోను జత చేసి కాషాయ పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చింది.
‘‘అబద్ధాలను ప్రచారం చేయడంలో భాజపా ముందుంటుంది. స్మృతి ఇరానీ మరింత స్పష్టంగా కనబడేందుకు ఆమెకు కొత్త కళ్లద్దాలు కావాలంటే.. మేం కచ్చితంగా పంపిస్తాం’’ అని జైరాం రమేశ్ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.