కోమటి రెడ్డికి షాక్ ఇచ్చిన ఆధిష్టానం.. చర్యలు తీసుకుంటారా?

-

హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి ఏఐసీసీ షాక్ ఇచ్చింది. తెలంగాణ వ్యహారాల ఇంఛార్జి ఠాగూర్‌పై కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆరా తీసింది. వివరాలు ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్‌కు ఆదేశించింది. తెలంగాణ పీసీసీ నియామకంపై కోమటి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ పీసీసీ ఓటుకు నోటు మాదిరిగా అమ్ముకున్నారని టీ వ్యహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్‌పై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అధిష్టానం గుర్రుగా ఉంది. కోమటి రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఇంగ్లీష్‌లో అనువాదం చేసి తమకు పంపాలని టీ కాంగ్రెస్‌ను ఏఐసీసీ ఆదేశించింది. ఈ వీడియో విన్న తర్వాత కోమటిరెడ్డిపై చర్యలు తీసుకుంటారని కాంగ్రెస్‌లోని కొందరు అంటున్నారు.

అయితే టీపీసీసీ ఛీప్ పదవిని కోమటిరెడ్డి ఆశించారు. ఈ మేరకు చాలా ప్రయత్నాలు చేశారు. అయినా అధిష్టానం రేవంత్ రెడ్డిని నియమించడంపై కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఇందులో భాగంగానే ఘాటుగా వ్యాఖ్యానించారని కోమటి రెడ్డి వర్గీయులు అంటున్నారు.

నిజానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు జరిగిన పీసీసీ కసరత్తు సమయంలోనే చాలా ప్రయత్నాలు చేశారు. అధిష్టానానికి లేఖలు రాశారు. తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. అంతేకాదు అప్పటి నుంచి ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీనియర్ నేత. నల్గొండ జిల్లాలో బలమైన నేత. ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎంపీగా గెలిచారు.

జిల్లా వ్యాప్తంగా సామాజికవర్గంగా తీసుకుంటే జిల్లాల్లో అత్యధిక నియోజకవర్గాల్లో పట్టున్న నేత. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజశేఖర్ రెడ్డి హయాంలో కీలక పదవుల్లో పని చేశారు. కోమటి రెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు.

ఇక కోమటిరెడ్డి వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి వర్గీయులు ఖండించారు. ఒక సీనియర్ అయి ఉండి అలా మాట్లాడటం సరి కాదని అంటున్నారు. కోమటి రెడ్డితో రేవంత్ మాట్లాడతారని, చిన్న చిన్న విబేధాలు త్వరలో సమసిపోతాయని అంటున్నారు. ఇదిలా ఉంటే కోమటిరెడ్డిపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందా అనే చర్చ సాగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version