కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ మీద అనేక కుట్రలు చేసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సోమవారం కరీంనగర్‌లో బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుభమంగళ గార్డెన్స్‌లో నిర్వహించిన సెమినార్‌లో ఆయన పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. దేశ చరిత్రలో అంబేడ్కర్ ఎదుర్కొన్న అవమానాలు మరెవరూ ఎదుర్కోలేదని చెప్పారు.ఎన్ని అవమానాలు ఎదురైనా.. అడుగడుగునా హేళనకు గురైనా వాటినే సోపానాలుగా మార్చుకుంటూ తన చదువుతో సమాజ శ్రేయస్సుకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ధారపోసిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. అంబేడ్కర్‌ను కాంగ్రెస్ అడుగడుగునా అవమానించిందని బండి సంజయ్ విమర్శించారు.