క్యాథలిక్ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూసిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం వాటికన్ సిటీలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని వాటికన్ సిటీ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పోప్ మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా పోప్ ఫ్రాన్సిస్ మృతిపట్ల సంతాపం ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆయన ఓ పోస్టు పెట్టారు.
‘పోప్ ఫ్రాన్సిస్ మరణం ఎంతో బాధను కలిగించింది. ఈ విషాద సమయంలో క్యాథలిక్ సమాజానికి నా సంతాపం తెలియజేస్తున్నాను. ఫ్రాన్సిస్.. చిన్నప్పటి నుంచి క్రీస్తు ఆదర్శాలను సాకారం చేయడానికి తనను తాను అంకితం చేశారు. ఆయన పేదలు, అణగారిన వర్గాలకు ఎంతో సేవ చేశారు. ఆయనను కలిసిన సందర్భాలను నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఆయనతో చేసిన సంభాషణలను నేను ఎంతో ప్రేమగా గుర్తుంచుకుంటాను. భారతీయుల పట్ల ఆయనకున్న ప్రేమ ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది’ అని ప్రధాని తన ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.