ఇవాళ్టి నుంచి కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర ప్రారంభం

-

నేటి నుంచి కాంగ్రెస్ తలపెట్టిన భారత్ జోడో యాత్ర ప్రారంభం కానుంది.
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పాదయాత్రకు నేతృత్వం వహించనున్నారు. కన్యాకుమారి నుంచి రాహుల్‌ ఈ పాదయాత్రను షురూ చేయనున్నారు. కన్యాకుమారి నుంచి శ్రీనగర్‌ వరకు భారత్‌ జోడో యాత్ర జరగనుంది.

మొదటగా ఇవాళ శ్రీపెరుంబుదూరులో రాజీవ్‌ గాంధీకి రాహుల్ నివాళులర్పిస్తారు. ఈ క్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్ జాతీయజెండాను రాహుల్​కు అందజేస్తారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం రాహుల్ తమిళనాడులో నాలుగు రోజుల పాటు కొనసాగనున్న పాదయాత్రను ప్రారంభిస్తారు.

ఈనెల 11 వ తేదీన రాహుల్ పాదయాత్ర కేరళలో ప్రవేశిస్తుంది. భారత్‌ జోడో యాత్ర 5 నెలల పాటు 3,570 కిలోమీటర్లు జరగనుంది. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా ఈ పాదయాత్ర సాగనుంది. రోజుకు సగటున 25 కి.మీ. దూరం పాదయాత్ర కొనసాగేలా ప్రణాళిక రచించారు. ప్రతిరోజూ రెండు విడుతల్లో భారత్‌ జోడో యాత్ర కొనసాగనుంది. ఉ.7 నుంచి 10.30 వరకు ,మధ్యాహ్నం 3.30 నుంచి సా.6.30 వరకు యాత్ర సాగుతుందని కాంగ్రెస్ అధికార వర్గాలు తెలిపాయి. అన్ని వర్గాల ప్రజలను కలిసి రాహుల్ గాంధీ వారి సమస్యలు తెలుసుకోనున్నారు.
దేశంలో భాజపాయేతర శక్తులను కూడగట్టడమే లక్ష్యంగా రాహుల్‌ ఈ పాదయాత్ర చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version