ఫస్ట్ కాజ్ : ఆంధ్రప్రదేశ్ పీసీపీ చీఫ్ సాకే శైలజా నాథ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు వెనువెంటనే ఓ పోలీసు అధికారి వైద్య సేవలు అందించడంతో కుదుట పడ్డారు.
పోలీసులకూ, రాజకీయ నాయకులకూ తరుచూ వివాదాలు తలెత్తుతూనే ఉంటాయి. వివాదాల తీరు ఎలా ఉన్నా కూడా ఓ పోలీసు మానవత్వం చాటుకుంటే, మరో పోలీసు ఏమీ పట్టని విధంగా ఉంటాడు. ఎండల ధాటికి అవస్థ పడ్డ సీనియర్ కాంగ్రెస్ లీడర్, పీసీసీ చీఫ్ సాకేకు సకాలంలో వైద్యం అందించి అందరి మన్ననలూ అందుకున్నారీయన.
ఈ నేపథ్యాన ఒక్కటే చెప్పగలం ర్యాలీలు, ధర్నాలు జరిగేటప్పుడు జాగ్రత్త. సీనియర్లు అయితే ఇంకా జాగ్రత్త. ఎండలు మండుతున్నాయి. వీలున్నంత వరకూ బీపీ ఉన్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా బయటకు రావడం అస్సలస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఉన్నట్టుండి బీపీ కంట్రోల్ తప్పినా లేదా సుగర్ లెవల్స్ పెరిగిపోవడమో లేదా తగ్గిపోవడమో జరిగినా ఆరోగ్యానికే ప్రమాదకరం. నిరసనలు జరిగే ప్రాంతంలో వైద్య బృందాలు అందుబాటులో ఉండవు కనుక అస్సలు ఆరోగ్యంపై దృష్టి సారించకుండా ధర్నాలకు పోవడం మంచిది కాదు.
ఎందుకు ఇదంతా అంటే గురువారం సాకే శైలజా నాథ్ స్వల్ప అస్వస్థతకు గురి కావడం అక్కడి వర్గాల్లో ముచ్చెమటలు పోయించింది. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి తాజాగా రాహుల్ ను ఈడీ విచారిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ కార్యకర్తల నుంచి నిరసనలు రేగుతున్నాయి. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్-లో కూడా విజయవాడ కేంద్రంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. వీటికి సారథ్యం వహించిన సాకే ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. ఉన్నట్టుండి బీపీ ఆయనకు అదుపు తప్పింది. పోలీసులు నిరసన కారులను అడ్డుకుని సమీప కృష్ణ లంక స్టేషన్ కు తరలించడంతో అక్కడ ఆయన స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. అయితే అక్కడికి చేరుకున్న ఏసీపీ రవి కిరణ్ స్వతహాగా వైద్యులు కావడంతో ఆయనకు ప్రథమ చికిత్స అందించి తరువాత ఇంటికి పంపించారు. ఒకవేళ సమయానికి రాకుండా ఉంటే సాకే ఆరోగ్య పరిస్థితి ఏమయ్యేదో !