తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ ఠాగూర్ ఒకప్పుడు పార్టీ నేతలను చెడుగుడు ఆడుకున్నారు. రాష్ట్రానికి పార్టీ ఇంఛార్జ్‌గా వచ్చిన కొత్తలో..రాహుల్ గాంధీకి ఠాగూర్ ఎంత చెబితే అంత అని ప్రచారం జరిగింది. నేతలు కూడా మరో మాట లేకుండా ఇంఛార్జ్ మాటే ఫైనల్ అన్నట్టు వ్యవహరించారు..కానీ ఆ తర్వాత ఎన్నికల్లో వరుస వైఫల్యాలతో ఇంచార్జ్ కూడా కూడా ఢిల్లీకే పరిమితమయ్యారట..ఇక అదును చూసుకుని సీనియర్ నేతలు ఇంఛార్జ్ పై ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారట..
వచ్చిన కొత్తలో ఒక్కసారి చెప్తే.. నేను వందసార్లు చెప్పినట్టే అనే రేంజ్‌లో నేతలకు దడ పుట్టించారు పార్టీ ఇంచార్జ్ ఠాగూర్. తెలంగాణలో పార్టీని గాడిలో పెట్టడానికే ఆయన వచ్చారని నేతలు కూడా ఆయన చెప్పిన దానికి తలూపారు. అయితే దుబ్బాక ఉపఎన్నిక ఫలితం,గ్రేటర్ ఫలితాలతో ఠాగూర్ ప్రభ క్రమంగా మసక బారింది. పీసీసీకి కొత్త చీఫ్ ఎంపిక ప్రక్రియ మొదలయ్యాక అది ఇంకాస్త పెరిగింది. దింతో ఆయన కాస్త గాంధీభవన్ కి దూరమయ్యారన్న చర్చ నడుస్తుంది.
తెలంగాణలో ఏ కార్యాచరణ చేపట్టిన.. కోర్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.. ప్రతి 15 రోజులకు ఖచ్చితంగా కోర్ కమిటీ సమావేశం ఉంటుంది.. అని వచ్చిన కొత్తలో ఠాగూర్ ప్రకటించారు. ఇప్పటి వరకు ఒకటి రెండు సమావేశాలు జరిగాయి తప్పితే.. కోర్ కమిటీ అనేది ఒకటి ఉందన్న ఊసే మర్చిపోయారు. కొత్తలో కాంగ్రెస్ నేతలు ఇబ్బడిముబ్బడిగా వాడిన జూమ్ మీటింగ్‌లు కూడా ఇప్పుడు లేవు.
ఇక పీసీసీకి కొత్త చీఫ్ నియామకం వాయిదా పడింది. కాంగ్రెస్‌కి చావో రేవో లాంటి నాగార్జునసాగర్ ఉపఎన్నిక కోసం ఎలాంటి ప్లాన్ వేయాలి అన్నది కూడా పూర్తిగా పక్కన పెట్టేశారు. ఉపఎన్నికకుతోడు మరో రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ సిద్ధం కావాల్సి ఉంది. నేతలు టిక్కెట్లు కోసం అప్పుడే తీవ్ర స్థాయిలోనే పంచాయతీలు మొదలు పెట్టారు. నేతల సమన్వయం మాట దేవుడెరుగు కాంగ్రెస్ నాయకుల మధ్య అభిప్రాయ భేదాలతోనే సమయం సరిపోతుంది.
రాష్ట్రంలో ఓవైపు బీజేపీ వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తుంటే.. జిల్లాల్లో ఇంఛార్జ్ పర్యటనలు చేసి నాయకులను సమన్వయం చేయడం లేదని పార్టీలోనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 2023లో అధికారమే టార్గెట్ అని చెప్పిన ఇంచార్జ్ మాయమయ్యారని సెటైర్లు వేస్తున్నారు. ఇక సీనియర్ నేతలు మొదటి నుంచి ఠాగూర్ కి కాస్త గ్యాప్ పాటిస్తూ వస్తున్నారు. దీంతో నేతల తీరులోనే ఇంచార్జ్ కూడా మారారని సొంత పార్టీ నేతలే ఠాగూర్ పై సెటైర్లు వేస్తున్నారు.