బ్రిటన్‌ నుంచి ఇండియా వైవిధ్యాన్ని నేర్చుకోవాలి : కాంగ్రెస్

-

రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా నియామకం కావడం పట్ల ప్రపంచమంతా హర్షం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా భారత సంతతికి చెందిన తొలి బ్రిటన్ ప్రధాని పాలనా పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో ఇండియా మురిసిపోతోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ నుంచి భారత్ వైవిధ్యాన్ని నేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ.. మోదీ సర్కార్ కు చురకలంటించింది. వైవిధ్యం పట్ల మనం ప్రదర్శించే గౌరవానికి భారత్‌ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని గుర్తు చేసింది. ఆ వైవిధ్యాన్ని రాజకీయాల్లోనూ చూపించాలని హితవు పలికింది.

గత ఎనిమిదేళ్లుగా అన్నీ మారిపోయాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. రిషి సునాక్‌ అత్యున్నత పదవికి ఎగబాకడం నుంచి భారత్‌ పాఠం నేర్చుకోవాలని ఆశిస్తున్నామని కాంగ్రెస్‌ నేత చిదంబరం పేర్కొన్నారు. మైనార్టీల నుంచి ఒకరిని అత్యున్నత పదవికి ఎన్నుకునే పద్ధతిని ఆచరించాలని అన్నారు. తొలుత కమలా హ్యారిస్‌..ప్రస్తుతం రిషి సునాక్‌.. అమెరికా, బ్రిటన్‌ ప్రజలు మెజార్టీయేతర పౌరులను ప్రభుత్వంలో అత్యున్నత స్ధానాలకు ఎన్నుకున్నారని చిదంబరం ట్వీట్‌ చేశారు.

బ్రిటిషర్లు మైనార్టీ వర్గాలకు చెందిన వ్యక్తిని అత్యున్నత పదవికి ఎన్నుకున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్‌ వ్యాఖ్యానించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన సంఘటన అని తెలిపారు. రిషి సునాక్‌ ఎదిగిన తీరును మనం వేడుకలా జరుపుకోవాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version