దేశానికి దిశ, దిశ నిర్దేశించిన పార్టీ.. ఇప్పుడు సంక్షోభంలో పడింది. నవ భారతాన్ని నిర్మించిన పార్టీ.. సొంతిల్లు చక్కబెట్టుకోలేకపోతోంది. రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలు ఉండాలో డిసైడ్ చేసిన పార్టీ.. తనకు పూర్వవైభవం ఎప్పుడొస్తుందోనని చకోర పక్షిలా ఎదురుచూస్తోంది. సమష్టి కార్యాచరణ తీసుకుంటేనే పార్టీకి మనుగడ ఉంటుందనే విషయాన్ని ఇప్పటికైనా గుర్తించకపోతే.. కాంగ్రెస్ ను ఇక ఆ దేవుడు కూడా కాపాడలేడా…
కాంగ్రెస్ పార్టీ నానాటికీ పతనం కావడానికి సోనియాగాంధీ నాయకత్వ లేమే కారణమంటూ మాజీ రాష్ట్రపతి, ఒకప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ తన స్వీయ చరిత్రలో రాశారు. అయితే ప్రస్తుతం అదే కారణంతో పార్టీ అధినాయకత్వాన్ని చికాకు పెడుతున్న సీనియర్లకు ప్రణబ్ వ్యాఖ్యలు కొండంత బలానిచ్చాయి. తాము లేవెనత్తిన అంశాన్నే ప్రణబ్ కూడా తన ఆత్మకథలో ప్రస్తావించారని, అప్పుడు తమపై విమర్శలు చేసిన వాళ్లు ఇప్పుడేమంటారని వారు ప్రశ్నిస్తున్నారు. స్ధూలంగా సోనియా గాంధీ నాయకత్వ మార్పు ద్వారానే కాంగ్రెస్ పార్టీ సంక్షోభం నుంచి బయటపడి పునర్ వైభవం సాధించగలదని వారు నమ్ముతున్నారు.
అసమ్మతి నేతల వ్యాఖ్యలతో పార్టీలో కలకలం రేగడంతో.. ఎట్టకేలకు వారితో భేటీకి సోనియా ముందుకొచ్చారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత కమల్‌నాథ్ ప్రధానంగా ఈ భేటీ కోసం కృషి చేసినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజకీయాల నుంచి తప్పుకుంటానని కొద్ది రోజుల కిందట ప్రకటించిన కమల్‌నాథ్.. అసమ్మతి నేతలు లేవనెత్తిన అంశాలను లోపాయికారిగా వారిని సమర్థిస్తూ వచ్చారు. జనవరిలో పార్టీ సంస్థాగత ఎన్నికలు జరగవచ్చని చాలా కాలం నుంచి ప్రచారం సాగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… రాహుల్‌కు పార్టీ పగ్గాలు తిరిగి అప్పగించడానికి ఓ ప్రణాళిక ప్రకారం ఈ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
రాహుల్‌కు పార్టీ బాధ్యతలను అందించడానికి అందుకు ప్రధానంగా సీనియర్ల ఆమోదం కావాలి. అందుకే లేఖ రాసిన సీనియర్లు- గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ, వీరప్ప మొయిలీలతో పాటు మరికొందరితో ఆమె మంతనాలు సాగిస్తారని వినిపిస్తోంది. వారి ఆలోచన తెలుసుకోవడం ఒక ఎత్తయితే- పార్టీకి ఓ మంచి టీమ్‌ను ఏర్పాటు చేసి- కీలకాంశాలపై సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్లేలా వ్యూహరచన సాగించాలని సోనియా తలపోస్తున్నట్లు సమాచారం.
2014 నుంచీ ఇప్పటివరకూ జరిగిన కాలమంతా కాంగ్రెస్ కు బ్యాడ్ టైమే. మా తాతలు నేతులు తాగారు. మా మూతులు వాసన చూడండి అంటే.. అందుకు ఎవరూ సిద్ధంగా లేరు. ఇప్పటికైనా గాంధీ కుటుంబం బాధ్యత తీసుకుని ఇల్లు చక్కబెడితేనే కాంగ్రెస్ సమస్యలు తీరతాయి. రాజకీయాల్లో కూడా గణనీయమైన మార్పులు వచ్చాయి. నాయకులు చెప్పే మాటల కంటే.. చేసే చేతల్నే ప్రజలు ఎక్కువగా గమనంలోకి తీసుకుంటున్నారు. అందుకే ఇంకా గతకాలపు ఘనకార్యాలు చెప్పి ఓట్లడిగే పని మానేసి.. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ వ్యూహాలు రచించాల్సిన అవసరం కాంగ్రెస్ కు ఎంతైనా ఉంది.
ఓవైపు బీజేపీ సరికొత్త రాజకీయ వ్యూహాలతో విజృంభిస్తుంటే.. కాంగ్రెస్ సంప్రదాయ రాజకీయం చేయడం చాలా మంది పార్టీ కార్యకర్తలకు కూడా రుచించడం లేదు. ఇప్పటి పరిస్థితుల్లో దూకుడు రాజకీయం చేయాలని చాలా మంది నేతలు భావిస్తున్నారు. కానీ అధిష్ఠానం మాత్రం ఎప్పటిలాగే తనకు అలవాటైన రీతిలో నాన్చుతోంది. మొన్నటికి మొన్న తెలంగాణలో విజయశాంతి లాంటి నేత కాంగ్రెస్ పోరాటాలు చేయడానికి సిద్ధంగా లేదని ఆరోపణలు చేశారు. అందుకే బీజేపీలో చేరుతున్నానని కూడా బహిరంగంగానే చెప్పారు. ఇలాంటి నేతలు చాలా మంది పలు రాష్ట్రాల్లో అధిష్ఠానంపై అసంతృప్తితోనే ఇతర పార్టీల్లోకి వెళుతున్నారు. ఇప్పటికైనా వలసలకు అడ్డుకట్ట పడాలంటే.. బీజేపీ ఉలిక్కిపడే స్థాయిలో కాంగ్రెస్ వ్యూహరచన చేయాల్సి ఉంటుంది.
కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా బలం, బలహీనత గాంధీ కుటుంబమే. గాంధీలకు ఇప్పటికీ జనాకర్షణ శక్తి ఉందనే ప్రశ్నలు వస్తున్నా.. అందరి ఆమోదం ఉన్న నాయకత్వం వారికే సాధ్యమనే అభిప్రాయాలూ ఉన్నాయి. గతంలో సోనియా ఎంత పట్టుదలగా రాజకీయం చేశారో.. ఇప్పుడు రాహుల్ గాంధీ అంతకుమించిన పట్టుదలతో పనిచేయాలని కాంగ్రెస్ సీనియర్లు సూచిస్తున్నారు. రాహుల్ దేశవ్యాప్తంగా యాత్ర చేపట్టాలని కూడా కాంగ్రెస్ క్యాడర్ కోరుకుంటోంది. అప్పుడే దేశంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కొత్త జోష్ వస్తుందని, పార్టీకి కూడా ఊపొస్తుందనే వాదన ఉంది. అయితే పార్లమెంట్ కే హాజరు కాని రాహుల్.. యాత్రలేం చేస్తారనే విమర్శలు.. ఈ ప్రతిపాదనకు ఆదిలోనే హంసపాదుగా మారుతున్నాయి. రాహుల్ లో గతంలో ఉన్న పోరాటపటిమ కూడా ఇప్పుడు కనిపించడం లేదు.
అటు అధిష్ఠానం, ఇటు సీనియర్లు.. కాసేపు ఇగోలు పక్కనపెట్టి.. మనసు విప్పి మాట్లాడుకుంటే అన్ని సమస్యలు పరిష్కారమౌతాయి. ఒకసారి ఏకాభిప్రాయం కుదిరాక సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం పెద్ద కష్టమేం కాదు. దీంతో పాటు సమకాలీన పరిస్థితులపై పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకోవాలనే విషయంలో కూడా ఈ మధ్య స్పష్టత ఉండటం లేదు. ఈ అంశంపై కూడా కాంగ్రెస్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నేతలు తలో మాట మాట్లాడకుండా.. ఒకేతాటిపై ముందుకెళ్తేనే.. పార్టీతో పాటూ తమకూ మనుగడ ఉంటుందనే విషయం గుర్తుంచుకుంటే అందరికీ మంచిది.