మరికొద్ది నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీకి పార్టీలో కీలక పదవిని కట్టబెట్టారు. యూపీ (నార్త్) జనరల్ సెక్రటరీగా ఆమెను నియమిస్తూ ఉత్తర్వూలు జారీ చేశారు. దీంతో ప్రియాంక గాంధీ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించనున్నారు. వయోభారం, ఇతర కారణాలతో పార్టీకి సోనియా గాంధీ క్రియాశీలకంగా దూరం అవుతున్న తరుణంలో రాహుల్‌కు బాసటగా నిలవడం కోసం ప్రియాంకను తెర మీదకు తీసుకు రావడాన్ని రాజకీయ వర్గాలు స్వాగతిస్తున్నాయి. ఆమె ఇప్పటి వరకు తన తల్లి, సోదరుడు నియోజకవర్గాలైన రాయబరేలీ, అమేథీలో మాత్రమే తన రాజకీయ పాత్రను పోషించారు.
ఆమె నియామకంతో ఈ ఎన్నిక మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్)గా కేసీ వేణుగోపాలు ను నియమించారు. దీనితో పాటు కర్ణాటక ఇన్‌ఛార్జిగానూ ఆయన కొనసాగుతారు. పశ్చిమ ఉత్తర ప్రదేశ్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా జ్యోతిరాధిత్య సింధియాను నియమించారు. అయితే ఉత్తర ప్రదేశ్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా వ్యవహరించిన గులాం నబీ ఆజాద్‌ను హర్యానా జనరల్ సెకట్రరీగా మార్చారు. ప్రియాంక గాంధీ కి బాధ్యతలు అప్పగించడంతో దేశ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.