కోమటిరెడ్డిని వదలని కాంగ్రెస్..మోదీతో భేటీ…ఇదేం ట్విస్ట్?

-

రేవంత్ రెడ్డి పి‌సి‌సి అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి వ్యతిరేక గళం వినిపిస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి..ఆ మధ్య మునుగోడు ఉపఎన్నికలో బీజేపీలోకి వెళ్ళి పోటీ చేసిన తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని కాంగ్రెస్ శ్రేణులని కోరిన ఆడియోలు బయటకొచ్చిన విషయం తెలిసిందే. ఇక దీనిపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయ్యి షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చింది. దానికి కోమటిరెడ్డి వివరణ కూడా ఇచ్చారు.

అయినా ఆయనపై వేటు పడటం ఖాయమని అంతా భావించారు. పైగా ఇటీవల పార్టీ పదవుల పంపకాల్లో కోమటిరెడ్డికి ఏ పదవి ఇవ్వలేదు. దీంతో ఆయనని కాంగ్రెస్ నుంచి బయటకు పంపించేస్తారని ప్రచారం జరిగింది. ఇదే సమయంలో ఊహించని విధంగా కోమటిరెడ్డి తాజాగా ఏ‌ఐ‌సి‌సి అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని వెంకటరెడ్డి స్వయంగా వెల్లడించారు.  తెలంగాణ కాంగ్రెస్‌లో చోటుచేసుకుంటున్న వ్యవహారాలపై చర్చించామని, సీనియర్లు పార్టీని వీడడం పైన చర్చ జరిగిందని, అలాగే టిపిసిసి కమిటీ నియామకంలో సీనియర్లకు స్థానం దక్కకపోవడం పైన మల్లికార్జున ఖర్గే తో చర్చించినట్లు వెంకటరెడ్డి తెలిపారు. అదే సమయంలో వెంకటరెడ్డికి పదవి దక్కకపోవడంపై ఖర్గే వివరణ ఇచ్చారట. ఇక త్వరలోనే వెంకటరెడ్డికి ఏ‌ఐ‌సి‌సిలో కీలక పదవి ఇస్తారని తెలిసింది. అంటే ఆయనని పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు లేవాలని స్పష్టంగా తెలుస్తోంది.

అయితే ఇటీవల పదవుల పంపకాలు కాంగ్రెస్ లో చిచ్చు పెట్టాయి. కొందరు పదవులు దక్కకపోవడంపై అసంతృప్తిగా ఉన్నారు. మరికొందరు తమకు తగిన పదవులు రాలేదని రాజీనామాలు చేస్తున్నారు. అటు వ్యూహకర్త సునీల్ ఆఫీసులపై సైబర్ పోలీసులు దాడులు చేయడం కలకలం రేగింది. ఇలా కాంగ్రెస్ లో పెద్ద రచ్చ నడుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పరిస్తితి ఎవరికి అర్ధం కాకుండా ఉంది. ఆ పార్టీ ఎప్పుడు గాడిలో పడుతుందో చూడాలి.

ఇదిలా ఉంటే కోమటిరెడ్డి..16వ తేదీన మోదీతో భేటీ కానున్నారు..పలు అభివృద్ధి పనుల కోసమే ఆయన..మోదీని కలుస్తున్నారని తెలిసింది. కానీ ఆయన బీజేపీలోకి వెళ్లడానికే…భేటీ అవుతున్నారనే వార్తలు వస్తున్నాయి. మరి చూడాలి కోమటిరెడ్డి కాంగ్రెస్ లో ఉంటారో..లేక బీజేపీలోకి వెళ్తారో.

Read more RELATED
Recommended to you

Exit mobile version