రాజకీయాల్లో ఉన్నవారు.. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న వారు గతాన్ని మరిచిపోతారని అంటారు. ఇప్పుడు అచ్చు అలానే వ్యవహరిస్తున్నారు టీడీపీ నాయకులు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన పరివారానికి ఓ కొత్త విషయం దొరికింది. దీంతో జగన్ సర్కారును ఏకేస్తున్నారు. అయితే, ఇలాంటి అంశంలోనే.. గతంలో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో తెలుసుకుంటే.. మంచిదని, ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం వంటి నాయకుల విషయం చంద్రబాబు అండ్ కో ఎలా వ్యవహరించారో.. ఎలాంటి కేసులు పెట్టారో గుర్తు చేసుకోవాలని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి తాజాగా రేగిన వివాదం మరోసారి వైసీపీ వర్సెస్‌టీడీపీల తీవ్ర యుద్ధంగా మారబోతోందని అంటున్నారు.
విషయంలోకి వెళ్తే.. విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన పై గుంటూరు జిల్లా లక్ష్మీపురానికి చెందిన ఓ మహిళ(65) సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించింది. అదేసమయంలో సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తూ.. ఆమె తీవ్ర పదజాలంతో దూషణ లు చేసింది. దీంతో ఇది పోలీసుల దృష్టికి వెళ్లడం, దీనిపై సీఐడీ జోక్యం చేసుకుని ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఈ నేరం కను క రుజువైతే.. జైలు, జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఇదీ జరిగింది. రాష్ట్రంలో ఇలాంటి పరిణామాలను అరికట్టేందుకు.. అంటే.. ప్రభుత్వంపై, అధికారంలో ఉన్న కీలక నాయకులపై ఉద్దేశ పూర్వకంగా వ్యాఖ్యలు చేసేవారిని, వ్యతిరేక ప్రచారం చేసేవారి ని నిలువరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే..కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వమే సోషల్ మీడియాను ఇష్టానుసారం వినియోగించరాదని పేర్కొంది. ఇక, రాష్ట్రం లో గత ఐదేళ్ల కాలంలో పాలించిన చంద్రబాబు విషయాన్ని పరిశీలించినా.. ఆయన కూడా అనేక మందిపైకేసులు పెట్టించారు. కానీ, ఇప్పుడు గుంటూరు కు చెందిన వృద్ధురాలిపై జగన్ ప్రభుత్వం కేసులు పెట్టడాన్ని చిలవలు పలవలు చేసి ప్రచారం చేస్తున్నారు. ఓ వృద్ధురాలిపై కేసులు పెడతారా? అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి వృద్ధురాలైనా.. మరెవరైనా.. చట్టం ముందు సమానులే. అయితే, ఈ విషయంలో మినహాయింపులు కావాలంటే.. చేసిన తప్పులను ఒప్పుకొని క్షమాపణ చెబితే సరిపోతుం దనేది నిపుణులమాట. కానీ, టీడీపీ నాయకులు మాత్రం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా దీనిని రాజకీయం చేశారు.
60 ఏళ్ల వృద్ధురాలిపై కేసులా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి గతంలో చంద్రబాబు ప్రభుత్వం 65 ఏళ్లు నిండిన ముద్రగడ పద్మనాభంపై కేసులు పెట్టిన సందర్భాలు మరిచిపోవడంపై పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. అదేసమయంలో రాష్ట్రంలో తుని ఘటనకు సంబంధించి నలుగురు వృద్ధులను అరెస్టు చేసిన సందర్భాలు కూడా మరిచిపోతే ఎలా స్వామీ? అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు మీరు మాత్రం తక్కువగా వ్యవహరించారా? రాజధానిపై కథనాలు రాశారని జర్నలిస్టులను అర్ధరాత్రి పూట పోలీస్ స్టేషన్లకు తరలించిన సందర్భాలు ఉన్నాయి కదా?! పేదలపై కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి కదా?? అవన్నీ మరిచిపోయి.. ఇప్పుడు తగుదునమ్మా.. అంటూ వృద్ధురాలి విషయాన్ని భుజాలకెత్తుకున్నారే! అంటున్నారు. తప్పు ఎవరు చేసినా తప్పే.. ఈ విషయంలో చంద్రబాబు నిర్మాణాత్మకంగా వ్యవహరించి.. వృద్ధురాలితో సారీ చెప్పిస్తే.. సరిపోయేది కదా!! కానీ, ప్రభుత్వంపై బురదజల్లుడే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని అంటున్నారు వైసీపీ నేతలు.