కరోనా మహమ్మారికి కేంద్ర బిందువైన వూహాన్ సిటీలోని హాస్పిటళ్లలో ప్రస్తుతం కరోనా పేషెంట్ల సంఖ్య జీరో (సున్నా)కు చేరుకుంది. ఈ మేరకు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ అధికారి ఒకరు వివరాలను వెల్లడించారు. ఆదివారం వరకు వూహాన్ సిటీలోని హాస్పిటళ్లలో కరోనా పేషెంట్ ఒక్కరు కూడా లేరని.. శనివారం వరకు అందరూ డిశ్చార్జి అయి వెళ్లిపోయారని తెలిపారు. కాగా 76 రోజుల లాక్‌డౌన్ అనంతరం ఏప్రిల్ 8వ తేదీన వూహాన్‌లో కార్యకలాపాలు యథావిధిగా ప్రారంభమైన తరువాత.. ఇప్పుడు అక్కడి హాస్పిటళ్లలో పేషెంట్ల సంఖ్య సున్నాకు చేరుకోవడం నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
చైనాలోని వూహాన్ సిటీలోనే గతంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. ప్రపంచ దేశాలన్నీ ఆరోపిస్తున్న ప్రకారం.. కరోనా వైరస్ వూహాన్‌లోనే పుట్టగా.. అక్కడ ఏప్రిల్ 16 నాటికి 50,333 మందికి కరోనా సోకింది. మొత్తం 3,869 మంది ఆ ఒక్క సిటీలోనే కరోనా కారణంగా చనిపోయారు. ఇక చైనాలోని మరో సిటీ హూబేలో 68,128 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో యుద్ద ప్రాతిపదికన హాస్పిటళ్లను ఏర్పాటు చేసిన చైనా కరోనా రోగుల సంఖ్యను చాలా త్వరగా తగ్గించగలిగింది.
అయితే కరోనా కేసుల విషయంలో మొదట్నుంచీ చైనా అనుమానాస్పదంగానే వ్యవహరిస్తోంది. ఉన్న పళంగా అక్కడ కరోనా కేసుల సంఖ్య సున్నా అవ్వడం.. మళ్లీ కొత్త కేసులు నమోదు కావడం.. వూహాన్‌లో లాక్‌డౌన్ ఎత్తివేయడం.. తదితర పరిణామాలను చూస్తే.. చైనా బయటి ప్రపంచానికి చెప్పని ఎన్నో విషయాలు అక్కడ దాగి ఉన్నాయని తెలిసింది. అయితే తాజాగా వూహాన్‌లో కరోనా పేషెంట్ల సంఖ్య సున్నాకు చేరుకోవడం నిజంగానే అందరినీ ఆశ్చర్యానికే కాదు, షాక్‌కు కూడా గురి చేస్తోంది..!