బాసర త్రిపుల్ ఐటీ లో కరోనా కలకలం సృష్టించింది. ఏకంగా ఆరుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలింది. వారిని ఏ బ్లాక్ లో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా వారిని కాంటాక్ట్ అయిన వారికి కూడా కరోనా టెస్టులు చేస్తున్నారు. ఇదిలా ఉంటే గత కొద్దిరోజులుగా యూనివర్సిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు మరోసారి పోరుబాట పట్టారు. మెస్ టెండర్లకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేసినా ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు.
గత నెల జూలై 24 లోగా మెస్ టెండర్లు కంప్లీట్ చేస్తామని చెప్పి మాట తప్పారంటూ విద్యార్థులు ఫైర్ అవుతున్నారు. అయితే ఈసారి కొత్త టెండర్లు ఖరారు అయ్యేవరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు విద్యార్థులు. దీంతో మొండి పట్టుదలకు పోవద్దు అంటూ విద్యార్థులకు సూచించారు ఉన్నత అధికారులు. మెస్ టెండర్లకు నోటిఫికేషన్ రిలీజ్ చేసినందున ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. అయితే విద్యార్థులు మాత్రం కొత్త మెస్ టెండర్లు ఖరారు అయ్యాకే ఆందోళన విరమిస్తామని చెబుతున్నారు.