యావత్ దేశాన్నే గడగడలాడించిన కరోనా మహమ్మారి ఒకింత తగ్గుముఖం పట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్కడో ఒక చోట రోజూ పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వాక్సిన్ వచ్చేసింది ఇంకే భయం లేదు అనుకునే సామాన్య ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే. కరోనా నిబంధనలు పాటించకపోతే నా ఎంట్రీ తప్పనిసరి అంటోంది ఈ మహమ్మారి. తాజాగా వేల సంఖ్యలో భక్తులు గుమిగూడిన మేడారం మినీ జాతరలో కరోనా పిలవని పేరంటంలా వచ్చేసింది. మేడారం మినీ జాతరలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ నమోదైంది. అంతే కాకుండా మరికొందరిలోనూ మహమ్మారి లక్షణాలు ఉన్నాయి. వారందరిని క్వారంటైన్‌లో ఉంచారు. జాతరలో కరోనా కేసులు రావటంతో భక్తుల్లో ఆందోళన మొదలైంది. దీంతో అధికారులు అప్రమత్తయ్యారు.
అసలు మేడారం మినీ జాతరంటే ఏంటి..?
ములుగు జిల్లాలోని సమ్మక్క సారక్కలకు రెండేళ్లకోకసారి జాతర నిర్వహించటం ఆనవాయితీ. కొన్ని సంవత్సరాల నుంచి జాతరకు మధ్యలో మినీ జాతర నిర్వహిస్తున్నారు. నేటితో ఈ జాతర ముగియనుంది. చివరి రోజు కావటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రభుత్వం కోటి 52 లక్షల రూపాయలు వెచ్చించి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసేందుకు చర్యలు చేపట్టింది.
తెలంగాణలో మేడారం జాతరకు ప్రత్యేక స్థానం ఉంది. వన దేవతలైన సమ్మక్క సారాలమ్మకు భక్తిశ్రద్ధలతో మొక్కితే కోరిన కోరికలు తప్పక తీరుతాయని భక్తుల నమ్మకం. బెల్లాన్ని బంగారంగా కొలుస్తూ దేవతలకు సమర్పిస్తుంటారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఈ జాతర చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. భక్తుల తాకిడిని ప్రభుత్వ ముందుగానే అంచనా వేసి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. కానీ కరోనా నుంచి అధికారులు తప్పించుకోలేకపోయారు. ఈ నెల 24న మొదలైన ఈ జాతర నేటితో ముగియనుంది. అయితే ప్రస్తుతానికి కరోనా బారిన పడిన సిబ్బందిని క్వారంటైన్‌లో ఉంచారు. వారికి సమీప బంధువులు కూడా తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకోవాలని అధికారులు సూచించారు.