కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడప్పుడే తగ్గదని, అందుకు ఇంకో ఏడాది పడుతుందని అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ అన్నారు. ఈ మేరకు ఆయన తాజాగా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కోవిడ్ ప్రభావం 2021 చివరి వరకు తగ్గే అవకావం ఉంటుందని అన్నారు. ఈ ఏడాది చివరి వరకు కనీసం ఏదో ఒక కరోనా వ్యాక్సిన్‌కు అయినా అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం తెలిపే అవకాశం ఉందన్నారు.
ఇక వ్యాక్సిన్ ప్రజలకు 2021 మధ్య వరకు అందుబాటులోకి వస్తుందని ఫౌచీ అంచనా వేశారు. అయితే అమెరికాలో కరోనా గణాంకాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో ఫౌచీ విభేధించారు. ప్రస్తుతం అమెరికాలో ఫ్లూ సీజన్ ప్రారంభమైందని అందుకనే కరోనా కేసుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉందని అన్నారు.
చలికాలం వచ్చే వరకు కరోనా కేసుల సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉందని ఫౌచీ అన్నారు. లేదంటే పరిస్థితి ఇంకా తీవ్రతరం అవుతుందన్నారు. కాగా అమెరికాలో ప్రస్తుతం 66,36,247 కరోనా కేసులు ఉన్నాయి. 1,97,421 మంది చనిపోయారు. 39,17,962 మంది కోలుకున్నారు.