అమెరికాలో కరోనా కేసులు చాలా ఎక్కువ.. ఇటలీ వణికిపోతుంది.. స్పెయిన్, ఫ్రాన్స్ గడగడలాడిపోతున్నాయి.. యూకే, ఇరాన్ దడదడలాడిపోతున్నాయి.. ఇవి రోజూ మనం వార్తల్లో చూస్తున్న, వింటున్న విషయాలు! ఈ గణాంకాలను చూస్తే మాత్రం మనకు ఫుల్ హ్యాపీ అనిపించకమానదు! సుమారు 130 కోట్లకు పైగా జనాబా ఉన్న దేశంలో 11వేల చిలుకు కేసులు అంటే పెద్ద విషయం కాదు! మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం, మనం సాధించాం అన్న ఆలోచన, ఆనందం చాలా మందిలో ఉన్న సంగతి తెలిసిందే.
అయితే… ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… మనకు పాజిటివ్ అని తేలిన కేసుల సంఖ్య తక్కువే కానీ… అసలు ఎన్ని టెస్టులు చేశాం, ఎంత మందిని పరీక్షించాం అన్నది కూడా గమనించాల్సిన విషయం. విషయంలోకి వెళ్తే… ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్ కేసులు 20లక్షల 16వేల పైచిలుకు అనుకుంటే… అందులో మెజారిటీ స్థానం అమెరికా, స్పెయిన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, యూకే లు టాప్ ప్లేస్ లలో సగానికిపైగా కేసులతో ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే…
ఇక్కడ చేసిన టెస్టుల సంఖ్య కూడా చాలా ఎక్కువ. ఈ విషయంలో భారత్ వెనకబడి ఉందనే అనుకోవాలి! ఈ విషయంలో తాజా గణాంకాలు కాస్త ఆందోళన కలిగిస్తున్నాయనే భావించాలి!
ప్రస్తుతం 6,14,246 పాజిటివ్ కేసులు నమోదైన అమెరికాలో 31,00,387 టెస్టులు.. 1,77,633కేసులు ఉన్న స్పెయిన్ లో 6,00,000 టెస్టులు.. 1,62,488 కేసులు నమోదైన ఇటలీలో 10,73,689 టెస్టులు.. 1,43,303 పాజిటివ్ కేసులు నమోదైన ఫ్రాన్స్ లో 3,33,807 టెస్టులు.. 1,32,210 కేసులు నమోదైన జర్మనీలో 13,17,887 టెస్టులు.. 93,873 పాజిటివ్ కేసులున్న యూకేలో 3,82,650 టెస్టులు చేయగా… 11,555 పాజిటివ్ కేసులు నమోదైన భారత్ లో 2,44,893 టెస్టులు మాత్రమే చేశారు. ఈ లెక్కలే కాస్త ఆందోళన కలిగిస్తున్నాయనేది విశ్లేషకుల మాటగా ఉంది.
అంటే… మనదేశంలో వలసకూలీల పాదయాత్రలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న జనాల ధర్నాలు, ఇప్పటికీ ఆదివారం వస్తే చికెన్, మటన్ సెంటర్ల దగ్గర జనాల హడావిడి, ఇప్పటీకీ తగు జాగ్రత్తలు పాటించని కొందరు మొండి జనాల నడుమ ప్రపంచ దేశాలతో పోలిస్తే మనం చాలా తక్కువ ఎఫెక్టెడ్ అని భావిస్తున్న భావన తప్పేమో అనే ఆందోళన కలగక మానదు! మరణాలు తక్కువగా ఉండటం కాస్త సంతోషపడాల్సిన సంగతే అయినా… టెస్టుల సంఖ్య చలా తక్కువగా ఉన్న కారణంగా అప్పుడే ఆనందపడిపోకుండా, మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది పలువురి సూచనగా ఉంది.
ఈ క్రమంలో ప్రభుత్వాలు ఇంకా టెస్టుల సంఖ్యలు పెంచని పక్షంలో.. జనాలు కూడా ఇంకా దాగకుండా, దాచకుండా ఏమాత్రం కాస్త అనుమానం ఉన్నా కూడా టెస్టులు చేయించుకోని పక్షంలో.. చాపకింద నీరులా ఇది పెరిగిపోయి కొంపముంచే ప్రమాదం ఉందనే విషయం అంతా గుర్తించాలి.