వలస కూలీల ఆందోళన.. టీవీ జర్నలిస్టు అరెస్ట్‌

-

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటన వెలువడగానే.. వలసకూలీలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ముఖ్యంగా ముంబైలోని బాంద్రా పశ్చిమ రైల్వే స్టేషన్‌కు పెద్ద ఎత్తున చేరుకున్న వలసకూలీలు.. ఆంక్షలను ధిక్కరించి ఆందోళనకు దిగారు. తమను స్వస్థలాలకు పంపించాలంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

అయితే బాంద్రాలో జరిగిన నిరసనల వెనక ఓ టీవీ చానల్‌లో పనిచేస్తున్న రాహుల్‌ కులకర్ణికి లింక్‌ ఉన్నట్టుగా ముంబై పోలీసులు భావిస్తున్నారు. రైళ్ల ప్రారంభం కానున్నట్టు రాహుల్‌ ఇచ్చిన తప్పుడు సమాచారం వల్లే వలసకూలీల అక్కడికి భారీగా తరలివచ్చారని ముంబై జోన్‌-9 డీసీసీ అభిషేక్‌ త్రిముఖే తెలిపారు. ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న రాహుల్‌ను అరెస్ట్‌ చేశామని.. అతనిని రేపు కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.

భారీగా వలసకూలీలు బాంద్రా రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి అంత మంది ఒకచోట చేరడంతో అధికార యంత్రాంగం, ప్రభుత్వ పెద్దల్లో కలవరం రేగింది. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే ముంబైలో పరిణామాలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో ఫోన్‌లో మాట్లాడారు. లాక్‌డౌన్‌ అమల్లో ఉండగానే వందలాదిగా జనం గుమికూడటంపై ఆందోళన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version