కరోనా వైరస్ చైనాలోనే పుట్టిందని ప్రపంచంలోని చాలా దేశాలు ఎప్పటికప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. అయితే చైనా మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చుతోంది. కరోనా వైరస్‌ను తాము సృష్టించలేదని బుకాయిస్తూ వస్తోంది. అయినప్పటికీ ఎవరూ చైనాను నమ్మడం లేదు. ఇక తాజాగా బ్రిటన్, నార్వేకు చెందిన పరిశోధకులు అధ్యయనం చేపట్టి.. కరోనా ముందుగా చైనాలోనే పుట్టిందని తేల్చేశారు. చైనాలోని వూహాన్ సిటీ ల్యాబ్‌లో ఆ వైరస్‌ను కావాలని సృష్టించారని వారు తెలిపారు.
యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రొఫెసర్ అంగస్ డల్‌గ్లిష్, నార్వే వైరాలజిస్టు బిగ్గర్ సోరెన్సన్‌లు కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన క్యూఆర్‌బీ డిస్కవరీలో తమ సంయుక్త అధ్యయన వివరాలను ప్రచురించారు. అందులో తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా వైరస్ సహజసిద్ధంగా అభివృద్ధి చెందలేదని, దాన్ని ల్యాబ్‌లోనే కృత్రిమంగా సృష్టించారని వెల్లడైంది. దానికి సంబంధించిన ఆధారాలను కూడా తాము కనుగొన్నామని ఆ పరిశోధకులు తేల్చి చెప్పారు.
అయితే వైరస్ బయటికి వచ్చాక మనుషులకు వ్యాప్తి చెందడం ప్రారంభమైనప్పుడు పరివర్తనం చెందిందని వారు తెలిపారు. ల్యాబ్‌లోనే దాన్ని ఆ విధంగా మారేలా సృష్టించారని అన్నారు. సాధారణంగా వైరస్‌లు ఇతర జీవుల నుంచి బయటకు రావడం అనేది అంత సులభమేమీ కాదని, అంతకు ముందు ఇలా జరగలేదని.. సోరెన్సన్ తెలిపారు. వైరస్‌కు చెందిన జన్యు సంబంధ క్రమాన్ని తాము ఎంతో జాగ్రత్తగా పరిశీలించామని.. అది కచ్చితంగా సహజసిద్ధంగా ఉద్భవించిన వైరస్ అయితే కాదని, దాన్ని ల్యాబ్‌లోనే కృత్రిమంగా సృష్టించారని అన్నారు.
కాగా ఇలాంటి వైరస్‌లపై అమెరికా, చైనాలు ఎన్నో ఏళ్ల నుంచి ల్యాబ్‌లలో పరిశోధనలు చేస్తూనే ఉన్నాయని సోరెన్సన్ తెలిపారు. అయితే వైరస్ ల్యాబ్ నుంచి లీకై మనుషులకు వ్యాప్తి చెందాక చైనా ప్రభుత్వం ఆ విషయాలను బయటి ప్రపంచానికి తెలియకుండా చేసిందని అన్నారు.