కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి శ్వాసకోశాల ద్వారా వ్యాప్తి చెందుతుందన్న సంగతి తెలిసిందే. కరోనా ఉన్న వ్యక్తిని ముట్టుకున్నా, అతను ఉపయోగించిన వస్తువులను తాకినా లేదా.. అతను తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలువడే వైరస్‌ను పీల్చినా.. కరోనా వ్యాప్తి చెందుతుంది. అయితే కరెన్సీ నోట్ల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరిస్తోంది.
కరోనా ఉన్న వ్యక్తి ఇచ్చే కరెన్సీ నోట్లను ఎవరైనా తీసుకుంటే ఆ నోట్లపై ఉండే వైరస్ మరొకరి లోపలికి ప్రవేశించే అవకాశం కూడా ఉంటుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఎవరైనా క్యాష్ ఇవ్వదలిస్తే ఆన్‌లైన్‌లో నగదు ట్రాన్స్‌ఫర్ చేయడం ఉత్తమమని వైద్యులు సలహా ఇస్తున్నారు. యూపీఐ, ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ వంటి పేమెంట్ విధానాల ద్వారా ఆన్‌లైన్ చెల్లింపులు చేసుకోవాలని సూచిస్తున్నారు.
కాగా బ్యాంకింగ్ టెక్నాలజీ ప్రొవైడర్ సంస్థ సర్వత్రా టెక్నాలజీస్ వ్యవస్థాపక ఎండీ మందర్ అగాషె ఈ సందర్బంగా మాట్లాడుతూ.. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు క్యాష్ ఇవ్వకుండా ఆన్‌లైన్‌లో నగదు ట్రాన్స్‌ఫర్ చేస్తే మంచిదని అంటున్నారు. దీని వల్ల ఒకరినుంచి మరొకరికి కరోనా వ్యాప్తి చెందదని అంటున్నారు..!