రోజు రోజుకు క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. వారికి కావాల్సిన దానికోసం ఎంతకైనా తెగిస్తున్నారు. రాత్రి సమయంలో ఓ జంట ఏటీఎంలోకి దూరింది. వారి వేషాలు సీసీ కెమెరాలో చూసిన బ్యాంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పాట్నా పరిధిలోని ఓ ఏటీఎం వద్ద క్రిమినల్స్‌గా భావిస్తున్న యువ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. వారు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం మిషన్‌ను బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారని బ్యాంకింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి 2.30 గంటలకు జరిగింది. ఇద్దరు వ్యక్తులు గంటన్నర సేపు ఏటీఎం బూత్ లోపలే ఉన్నారని ముంబైలోని బ్యాంకు సెక్యూరిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పాట్నాలోని కంకర్‌బాగ్ ప్రాంతంలోని శాలిమార్ మొర్ వద్ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం వద్దకు పోలీసులు చేరుకుని నిందితులను పట్టుకున్నారు. పోలీసులు అక్కడికి వెళ్లే సరికి యువకుడు, బాలిక అసభ్యకర చర్యలకు పాల్పడుతున్నారు. వారు ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేయడం గానీ, బయటకు రావడం గానీ చేయడం లేదని కంకర్‌బాగ్ పోలీసులు తెలిపారు. వారు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు బ్యాంకు సెక్యూరిటీ అధికారులు అనుమానించారు. రాత్రి పొద్దు పోయిన తర్వాత ఏటీఎం బూత్‌లోకి ప్రవేశించి, దాన్ని బద్దలు కొట్టేందుకు ప్రయత్నించి ఉండొచ్చునని భావిస్తున్నట్లు తెలిపారు. పోలీసుల విచారణలో వారిద్దరూ ప్రేమికులని, మెడికల్ విద్యార్థులని తేలింది. వారిని విచారించి, ధృవ పత్రాలు పరిశీలించిన తర్వాత విడుదల చేశామని పోలీసులు చెప్పారు.