కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో సోమవారం (10-08-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. ఏపీలో కొత్తగా 7,665 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,35,525కు చేరుకుంది. 1,45,636 మంది కోలుకున్నారు. 87,773 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 2116 మంది చనిపోయారు.
2. తమిళనాడులో కొత్తగా 5,914 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,02,815కు చేరుకుంది. 2,44,675 మంది కోలుకున్నారు. 53,099 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 5041 మంది చనిపోయారు.
3. కరోనా కారణంగా ఈ సారి ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్‌ను దుబాయ్‌లో నిర్వహించుకునేందుకు గాను బీసీసీఐకి సోమవారం అధికారికంగా అనుమతి ఇచ్చింది. గతంలో మౌఖికంగానే చెప్పినా.. ఇప్పుడు అధికారికంగా పత్రాలను బీసీసీఐకి పంపింది. దీంతో ఐపీఎల్ ఇక యూఏఈలో అధికారికంగా జరగనుంది.
4. కరోనా వల్ల సెప్టెంబర్ 30వ తేదీ వరకు రైళ్లను రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. సాధారణ మెయిల్, ఎక్స్‌ప్రెస్, సబర్బన్, ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. కేవలం ప్రత్యేక రైళ్లను మాత్రమే నడిపిస్తామని రైల్వే శాఖ తెలిపింది.
5. దేశవ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 62,064 కరోనా కేసులు నమోదయ్యాయి. 1007 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 22,15,075కు చేరుకోగా, మొత్తం మరణాల సంఖ్య 44,386కు చేరుకుంది. మొత్తం 15,35,744 మంది కోలుకున్నారు. 6,34,945 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
6. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా సోకింది. ఇతర అనారోగ్య సమస్యల వల్ల ఆయన హాస్పిటల్‌కు వెళ్లగా కరోనా పరీక్షలు చేశారు. దీంతో పాజిటివ్ అని వచ్చింది. ఈ క్రమంలో ఆయన హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
7. గుజరాత్‌లో బహిరంగ ప్రదేశాల్లో ఇకపై మాస్కులు ధరించకపోతే రూ.200కు బదులుగా రూ.1వేయి జరిమానా విధించనున్నారు. ఆగస్టు 11 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తారు. మాస్కులను ధరించాలని చెబుతున్నా.. చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నారని, అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
8. తెలంగాణలో కొత్తగా 1256 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 80,751కి చేరుకుంది. 22,528 మంది చికిత్స తీసుకుంటున్నారు. 57,586 మంది కోలుకున్నారు. 637 మంది చనిపోయారు.
9. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి అద్భుతమని కేంద్ర బృందం ప్రశంసించింది. నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. రాష్ట్రంలో కరోనాను అదుపు చేసేందుకు తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగానే ఉన్నాయన్నారు.
10. రానున్న 2021వ సంవత్సరం వరకు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో కరోనా ప్రభావం తగ్గుతుందని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ అన్నారు. 2022 వరకు ప్రపంచంలో అసలు కరోనా కేసులు ఉండవన్నారు. కరోనా వల్ల ఏర్పడ్డ ఆర్థిక నష్టాన్ని భర్తీ చేయడం కష్టమేనని అన్నారు.