కరోనా వల్ల దేశంలో అనేక చోట్ల ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్‌లో బెడ్లకు కొరత ఏర్పడుతోంది. అనేక చోట్ల బెడ్లు లభించడం లేదు. కోవిడ్ వచ్చిన వారు తీవ్రమైన ఆందోళనకు గురవుతూ హాస్పిటళ్లలో చేరేందుకు యత్నిస్తున్నారు. దీనివల్లే బెడ్ల కొరత ఏర్పడుతోంది. అయితే కోవిడ్ వచ్చిన ప్రతి ఒక్కరూ హాస్పిటల్‌లో చేరాల్సిన పనిలేదు. కేవలం కొందరికి మాత్రమే ఆ అవసరం ఏర్పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కోవిడ్ వచ్చిన ప్రతి ఒక్కరూ ఆందోళన పడాల్సిన పనిలేదు. అలాగే కోవిడ్ రాగానే ప్రతి ఒక్కరూ హాస్పిటల్‌లో చేరాల్సిన అవసరం లేదు. ఆక్సిజన్ మీటర్ ద్వారా ఎప్పటికప్పుడు ఆక్సిజన్ స్థాయిలు కొలవాలి. ఆ స్థాయిలు 94 శాతం కన్నా తక్కువగా నమోదు అయితేనే హాస్పిటల్‌లో చేరాలి. ఇక కోవిడ్ ఉండి ఇంట్లో చికిత్స పొందేవారు 6 నిమిషాల వాకింగ్ టెస్టు చేయాలి.
వాకింగ్ చేసేముందు ఆక్సిజన్ లెవల్స్ కొలవాలి. 6 నిమిషాల పాటు వాకింగ్ చేశాక మళ్లీ ఆక్సిజన్ లెవల్స్ కొలవాలి. ఆ రీడింగ్స్ 94 శాతం కన్నా తక్కువ ఉంటే అప్పుడు హాస్పిటల్‌లో చేరాలి. అయితే కొన్ని సార్లు ఆ సంఖ్య కొంచెం అటు, ఇటుగా ఉంటుంది. కనుక కొన్ని నిమిషాల పాటు ఆగి మళ్లీ ఆక్సిజన్ స్థాయిలు కొలవాలి. అప్పుడు కూడా 94 శాతం కన్నా తగ్గితేనే హాస్పిటల్‌లో చేరాలి. అంతేకానీ కోవిడ్ వచ్చిన ప్రతి ఒక్కరూ హాస్పిటల్‌లో చేరాల్సిన పనిలేదు. 94 శాతం మందికి సాధారణ చికిత్సతోనే కోవిడ్ నయమవుతుందని టాటా మెమోరియల్ హాస్పిటల్ డాక్టర్ సీఎస్ ప్రమేష్ తెలిపారు.