శాంతి భద్రతల పరిరక్షణకు సహకరిస్తున్న పాతబస్తీ ప్రజలకు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ప్రార్థనల సందర్భంగా మక్కామసీదు, చార్మినార్ వద్ద ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ శుక్రవారం మధ్యాహ్నం చార్మినార్ వద్దకు వెళ్లి ప్రార్థనల అనంతరం నెలకొన్న పరిస్థితులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. పాతబస్తీలో ప్రశాంత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో షాపులు, హోటల్స్ రాత్రి 10 వరకు తెరిచి ఉంచే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు సీవీ ఆనంద్. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గత రెండు రోజుల నుంచి రాత్రి 8 గంటలకే షాపులు, హోటల్స్‌ను మూసివేయించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ నిబంధనను సడలించే విషయంపై పోలీసులు త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ ఆనంద్ హెచ్చరించారు. ఇటీవల అల్లర్లకు ప్రయత్నించిన వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో నగర ప్రజలంతా చూశారని తెలిపారు సీవీ ఆనంద్. మతవిద్వేషాలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఆ విషయంలో తమపై నమ్మకం ఉంచాలని కోరారు సీవీ ఆనంద్.